ICC Test Rankings: ICC తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పరుగుల యంత్రం, కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ - 5లో చోటు కోల్పోయాడు. అంతేకాదు కోహ్లీని అధిగమించి రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు. మరో వైపు భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఏకంగా అగ్రస్థానంలో నిలిచాడు.
గత ఐదేళ్లలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టాప్ - 5లో చోటు కోల్పోవడం ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న కోహ్లీ ఫామ్ లేమితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ కంటే 9 పాయింట్లు తక్కువగా ఉండటంతో ఆరో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 766 పాయింట్లు ఉన్నాయి.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ స్థిరంగా రాణిస్తున్నాడు. రెండేళ్ల క్రితం రోహిత్ శర్మకి టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. అప్పుడు అతడి ర్యాంకు 53. కానీ, రెండేళ్ల తర్వాత ఇప్పుడు టెస్టుల్లో టాప్ - 5 బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 773 ర్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి.
అగ్రస్థానంలో జో రూట్
ఇంగ్లాండ్ సారథి జో రూట్ ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆరేళ్ల తర్వాత రూట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో రూట్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు. ఇప్పుడు అతడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ను వెనక్కినెట్టి ఏకంగా నంబర్‌వన్‌గా నిలిచాడు. 916 పాయింట్లతో రూట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ (901), స్మిత్ (891) ఉన్నారు.
టాప్ 5లోకి దూసుకొచ్చిన అండర్సన్
భారత్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోన్న ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టాప్ - 5లో చోటు దక్కించుకున్నాడు. 813 పాయింట్లతో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాట్ కమిన్స్ (908) అగ్రస్థానంలో ఉండగా రవిచంద్రన్ అశ్విన్ (839) ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. బుమ్రా 758 పాయింట్లతో టాప్ - 10లో చోటు దక్కించుకున్నాడు.