ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి వర ప్రసాదితమైన ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్నాయి. ఊటీని మించిన హిల్ స్టేషన్లు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంకా బయట ప్రపంచానికి పూర్తిగా తెలియదు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ డిల్లా ఏజెన్సీ వరకు అటవీ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ఇంత అందమైన ప్రకృతి సౌందర్యం ఏపీలో ఉందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు. అప్పుడప్పుడు లంబసింగి జీరో డిగ్రీల ఉష్ణోగ్రత .. మారేడుమిల్లి అడవులు లాంటివి ప్రచారంలోకి వస్తూంటాయి. అంతకు మించిన అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. కానీ వాటికి సరైన దారి లేకపోవడం.. ప్రచారం లేకపోవడం కారణంగా ఎవరికీ తెలియడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు అక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు కలుపుతూ రహదారిని నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI ) నిర్ణయం తీసుకుంది.
తూర్పుగోదావరి - విశాఖ ఏజెన్సీలను కలుపుతూ హదారి నిర్మాణానికి నాయ్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రపంచ బ్యాంక్ నిధులను సమకూర్చనుంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని విజయనగరం జిల్లాతో కలుపుతూ రెండు రహదారులను ఇప్పటికే నాయ్ నిర్మిస్తోంది. పాడేరు నుంచి అరకు వరకు, కొయ్యూరు నుంచి పాడేరు వరకు ఈ రహదారి పనులు జరుగుతున్నాయి. పర్యాటకులకు ప్రస్తుతానికి ఇవే అరకు వెళ్లే మార్గాలు. విజయనగరం నుంచి లేదా విశాఖ పట్నం నుంచే అరకు వెళ్లాలి. అలా కుండా మరో వైపు నుంచి అరకుకు మార్గం ఉండాలన్న ఆలోచన కారణంగానే కొత్త మార్గం రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుంచి ఆ మార్గం నిర్మిస్తే ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సులువుగా పర్యాటక ప్రాంతంగా ఏజెన్సీకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కోస్తా, సీమ ప్రాంత ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వారు రాజమండ్రి మీదుగా అరకుకు వెళ్లేందుకు వీలుగా ఉండేలా రోడ్డు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ రహదారి మొత్తం 406 కి.మీ. మేర ఉంటుందని...దాదాపుగా రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డీపీఆర్ సిద్ధమైన తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు తక్కువగా జరుగుతూ ఉంటాయి. కారణాలు ఏమైనా అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా తక్కువగానే అందుతంటాయి. తూర్పుగోదావరి - విశాఖ ఏజెన్సీలను కలుపుతూ రోడ్డును నిర్మిస్తే పర్యాటక పరంగానే కాకుండా... అక్కడి ప్రజలకు ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుంది. నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా.. ప్రపంచ బ్యాంక్ నిధులతో వీలైనంత త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని భావిస్తోంది. ఇది పూర్తయితే టూరిజం పరంగా కూడా ఏపీకి మరింత అడ్వాంటేజ్ లభిస్తుంది.