అదిగో తోక అంటే ఇదిగో పులి అనే టైప్ జనం ఎక్కువ ! సోషల్ మీడియా మాయలో పడి కొట్టుకుపోయేవారైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తాలిబన్ల విషయంలో అదే జరుగుతోంది. ఎక్కడ ఏం జరిగినా.. అది తాలిబన్లకు అంటగట్టేసి ప్రచారం చేస్తున్నారు. ఆప్ఘనిస్థాన్‌లో అమెరికాకు చెందిన రక్షణ శాఖ విమానం నుంచి ఓ వ్యక్తి వేలాడుతూ వెళ్తున్న దశ్యాలు రెండురోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాకు చెందిన ఓ సెనెటర్ ఈ దృశ్యాలను పోస్ట్ చేసి తాలిబన్లు ఎవరినో ఉరి తీశారని .. వారి క్రూరత్వానికి నిదర్శమని ట్వీట్లు చేశారు. 


దీంతో ఇతరులు కూడా తాలిబన్లు ఓ వ్యక్తిని ఉరి తీసి అలా వేలాడ దీశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. అందరూ నమ్మేశారు కూడా. ఎందుకంటే తాలిబన్లు అంత కంటే దారుణమైన ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బయటకు తాలిబన్లు మాత్రం చాలా శాంతి ప్రవచనాలు చెబుతున్నారు. నిజానికి వారు హింసకు పాల్పడుతున్నారో లేదో నేరుగా ఎవరికీ తెలియదు. ఎంత మందిని చంపుతున్నారో స్పష్టత లేదు. కానీ అప్పుడప్పుడూ బయటకు వస్తున్న ఇలాంటి దృశ్యాలను వారి క్రూరత్వానికి ఆపాదించి.. వారంటే ప్రపంచం మరింత బయపడేలా చేస్తున్నారు. 


నిజానికి హెలికాఫ్టర్‌కు మనిషి వేలాడుతున్న దృశ్యం తాలిబన్ల ఆకృత్యానికి సంబంధించినది కాదు. ఆ తాడుకు వేలాడుతున్న వ్యక్తి కూడా చనిపోలేదు. ఆ వీడియో కాందహార్ నుంచి వచ్చింది. అది అమెరికాకు చెందిన హెలికాఫ్టర్ . తాలిబన్లకు శిక్షణ పొంది.. ఆ అమెరికా సైనిక హెలికాఫ్టర్‌ను నడిపే పైలట్లు ఎవరూ లేరు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా ఖాళీ చేయడంతో కాందహార్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎగురవేయాలనుకున్నారు. ఆ కార్యాలయంపైకి ఎలా చేరుకోవాలో అర్థం కాలేదు. హెలికాఫ్టర్ ద్వారా వేలాడుతూ కట్టాలని ప్రయత్నించారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఆ దృశ్యాల్లో కూడా ఉరి వేసినట్లుగా లేదు. తాలిబన్ జెండా పట్టుకున్నట్లుగా ఉంది. దీంతో ఆ అమెరికా సెనెటర్ కూడా తను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది.


ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఏం జరుగుతుందో కానీ అక్కడి పరిస్థితులు ప్రపంచం ముందు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. తాలిబన్లు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారనడానికి అనేక ఉదంతాలు బయట పడుతున్నాయి. అయితే నిజంగా అవి అక్కడ జరిగినవేనా లేక కల్పితాలా అన్నది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో ప్రభావంతో జరిగిన దాని కన్నా తీవ్రత ఎక్కువ ప్రచారం అవుతోంది.