Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో బుధవారం భారత్‌కు తొలి పతకం లభించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్‌ సింగ్‌ కాంస్యం ఒడిసిపట్టాడు. పురుషుల 109 కిలోల విభాగంలో ఏకంగా 355 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 163 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 192 కిలోలు ఎత్తాడు. ఇవన్నీ సరికొత్త జాతీయ రికార్డులే కావడం ప్రత్యేకం. జూడోలో తూలికా మన్‌ కనీసం రజతం ఖాయం చేసింది. ఫైనల్‌కు చేరుకుంది. 






పురుషుల జూడో వంద కిలోల విభాగంలో దీపక్‌ దేశ్వాల్‌ కథ ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో అతడు ఓటమి పాలయ్యాడు. గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన హ్యారీ లవెల్‌ హెవిట్‌ చేతిలో ఓటమి చవి చూశాడు. ఎక్కువ పెనాల్టీలు రావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత జరిగిన రెపిచేజ్‌లోనూ అతడికి పరాజయమే ఎదురైంది. ఫిజి ఆటగాడు తెవిటా టకయావా అతడిని ఓడించాడు. మహిళల 78 కిలోల జూడలో తూలికా మన్‌ పతకం ఖాయం చేసింది. సెమీ ఫైనల్‌ బౌట్‌లో న్యూజిలాండ్‌ అమ్మాయి సిడ్నీ ఆండ్రూస్‌ను ఓడించింది.  




పారా టేబుల్‌ టెన్నిస్‌లో రాజ్‌ అరవిందన్‌ విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ స్టేజ్‌ పోరులో జార్జ్‌ విండమ్‌ను 3-2 (9-11, 11-8, 11-8, 11-0, 10-12, 11-3) తేడాతో ఓడించాడు. పురుషుల 57 కిలోల బాక్సింగ్‌లో హుసాముద్దీన్‌ సెమీస్‌ చేరుకున్నాడు. 4-1 తేడాతో నమీబియా బాక్సర్‌ టి డెవెలోను ఓడించాడు. మహిళల 48 కిలోల బాక్సింగ్‌లో నీతూ గాంగ్‌హాస్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. అబాండన్‌ విధానంలో ఆమెను రిఫరీలు విజేతగా ప్రకటించారు.