Commonweath Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. బుధవారం సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో కెనడాను 3-2 తేడాతో ఓడించింది. సెమీస్ గెలిస్తే టీమ్‌ఇండియాకు కనీసం రజతం ఖాయమవుతుంది. సలీమా టెటె (3వ నిమిషం), నవనీత్ కౌర్ (22 ని), లాల్ రెమ్‌సియామి (51 ని) గోల్స్ చేశారు.
సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో టీమ్‌ఇండియా తిరుగులేని ఆటతీరుతో అదరగొట్టింది. రెండో నిమిషంలో సలీమా, 22వ నిమిషంలో నవనీత్ గోల్ కొట్టేంత వరకు మ్యాచ్ భారత్ నియంత్రణలోనే ఉంది. ఆ తర్వాత ప్రత్యర్థి విజృంభించింది. 23వ నిమిషంలో బ్రెన్నీ స్టెయిర్స్, 39వ నిమిషంలో హన్నా హ్యూగన్ గోల్స్ కొట్టి 2-2తో స్కోర్ సమం చేశారు. దాంతో గెలుపు కోసం టీమ్‌ఇండియా శ్రమించాల్సి వచ్చింది.
మంగళవారం భారత్‌ను 3-1 తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ ఇదే పూల్ నుంచి సెమీస్ చేరింది. ఫలితంగా సవితా పూనియా సేనపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడో క్వార్టర్లో గోల్ కొట్టేందుకు రెండు జట్లు బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. ఆఖర్లో కెనెడాకు వచ్చిన రెండు పెనాల్టీ కార్నర్లను భారత్ అడ్డుకుంది. 47వ నిమిషంలో మోనిక గోల్‌ను కెనడా కెప్టెన్ అడ్డుకోవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. ఎట్టకేలకు 51వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించి లాల్‌రెమ్‌సియామి గోల్ కొట్టి భారత ఆధిక్యాన్ని 3-2కు పెంచింది. కెనడా మరో గోల్ కొట్టకుండా అడ్డుకుంది.