Commonwealth Games 2022: భారత అమ్మాయిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. భారతీయులకు పెద్దగా తెలియని ఆటలో స్వర్ణ పతకం కొల్లగొట్టారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి లాన్‌బౌల్స్‌లో పసిడి పతకాన్ని ముద్దాడారు. ఫైనల్లో పటిష్ఠమైన దక్షిణాఫ్రికాను 17-10 తేడాతో చిత్తు చేశారు.
ఆ నలుగురు
లవ్లీ చౌబే, పింకి, నయన్‌మోని సైకియా, రూపా రాణి టిర్కేతో కూడిన భారత జట్టు సెమీస్‌లో తిరుగులేని ప్రదర్శన చేసింది. సోమవారం న్యూజిలాండ్‌ను 16-13 తేడాతో ఓడించి కనీసం రజతం ఖాయం చేసింది. మంగళవారం ఫైనల్లో పటిష్ఠమైన దక్షిణాఫ్రికాను ఓడించి ఆశ్చర్య పరిచింది. ఈ మ్యాచులో ఎండ్-7 తర్వాత టీమ్ఇండియా 8-2తో మెరుగైన ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సఫారీలు విజృంభించారు. కెప్టెన్ సిండెన్ రెచ్చిపోవడంతో ఎండ్-11కు 10-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆఖర్లో టెన్షన్ టెన్షన్
మరో నాలుగు రౌండ్లే మిగిలి ఉండటంతో టీమ్‌ఇండియాపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత రెండు ఎండ్స్‌లో వరుసగా రెండు పాయింట్లు అందుకోవడంతో 12-10తో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకమైన 14వ ఎండ్‌లో భారత అమ్మాయిలు తిరుగులేని పోరాట పటిమ కనబరిచారు. మూడు పాయింట్లు సాధించారు. దాంతో ఆఖరి ఎండ్‌లో సఫారీలు ఆరు పాయింట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం డ్రా చేయాలన్నా 5 పాయింట్లు సాధించాలి. కానీ భారత్ ప్రత్యర్థిని తేరుకోనివ్వలేదు. ఒక్క పాయింటు సైతం వదులుకోలేదు.
లాన్ బౌల్స్‌ను లాన్ బౌలింగ్ అనీ అంటారు. 1930లో దీనిని కామన్వెల్త్‌లో ప్రవేశపెట్టారు. ఇంగ్లాండ్ (51 పతకాలు), ఆస్ట్రేలియా (50 పతకాలు), దక్షిణాఫ్రికా (44 పతకాలు) ఎక్కువ సార్లు విజేతగా ఆవిర్భవించాయి.
మోదీ ప్రశంసలు
కామన్వెల్త్ లాన్ బౌల్స్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 'బర్మింగ్‌హామ్‌లో చారిత్రక విజయం! లవ్లీ చౌబే, పింకీ సింగ్, నయన్‌మోని, రూపా రాణి లాన్‌బౌల్స్‌లో స్వర్ణం తెచ్చినందుకు దేశం గర్విస్తోంది. జట్టు గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. వారి విజయం ఎంతోమందిని లాన్‌బౌల్స్ వైపు ఆకర్షిస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు.