Commonwealth Games 2022 Lawn Bowls India Secures Silver Medal: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది! లాన్‌ బౌల్స్‌ క్రీడలో మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకుంది. హోరాహోరీగా జరిగిన సెమీస్‌లో న్యూజిలాండ్‌ను 16-13 తేడాతో ఓడించింది. దీంతో టీమ్‌ఇండియాకు కనీసం రజతం ఖాయం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత్‌ స్వర్ణం కోసం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.


లవ్లీ చౌబే, పింకి, నయన్‌మోని సైకియా, రూపా రాణి టిర్కేతో కూడిన భారత జట్టు సెమీస్‌లో తిరుగులేని ప్రదర్శన చేసింది. ఒకానొక దశలో 1-6 తేడాతో ఓటమి అంచున నిలబడ్డారు. అక్కడ్నుంచి విజృంభించి ఆడిన అమ్మాయిలు 7-6తో ఆధిక్యంలోకి దూసుకొచ్చారు.  కివీస్‌ను వణికిస్తూ ఆధిక్యాన్ని 10-7కు పెంచుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి సైతం పుంజుకొని పోటీని రసవత్తరంగా మార్చేసింది. 13-12తో భారత్‌ను భయపెట్టింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుకుంది.






జూడోలో ఆశలు


సోమవారం భారత్‌ త్రుటిలో ఒక పతకాన్ని చేజార్చుకుంది. పురుషుల 81 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో అజయ్‌ సింగ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. 180 కిలోలు ఎత్తాడు. మహిళల జూడోలో సుశీలా దేవీ సెమీస్‌ చేరుకుంది. 48 కిలోల విభాగంలో హ్యారియెట్‌ బోనిఫేస్‌ను 10-0 తేడాతో చిత్తు చేసింది. మరొక్క మ్యాచ్‌ గెలిస్తే ఆమెకు పతకం ఖాయమవుతుంది. పురుషుల 60 కిలోల జూడోలో విజయ్‌ సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. విన్‌స్లేను ఓడించాడు.


అమిత్‌ పంగాల్‌ దూకుడు


బాక్సింగ్‌లో అమిత్‌ పంగాల్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. 48-51 కిలోల ఫ్లైవెయిట్‌ విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్స్‌లో నార్మీ బెర్రీని 5-0 తేడాతో చిత్తు చేశాడు. అతడు పతకం సాధిస్తాడన్న అంచనాలు ఉన్నాయి. స్క్వాష్‌లో సునయన సారా కురువిల్లా సెమీస్‌ ఫైనల్‌కు చేరుకుంది.


ఆరో స్థానంలో భారత్‌


కామన్వెల్త్ పాయింట్ల పట్టికలో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. మూడు స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం అందుకుంది. మొత్తం 6 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, కెనడా మనకన్నా ముందున్నాయి.