Chess World Cup 2023 Final: 


భారత గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్లకే చదరంగ ప్రపంచకప్‌ రన్నరప్‌గా అవతరించాడు. ఫైనల్లో విజయం సాధించనప్పటికీ భారతీయులు గర్వపడేలా చేశాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత విశ్వ చదరంగ యుద్ధాల్లో మహామహులను ఢీకొట్టగల ధీరుడు మనకున్నాడని చాటాడు. భవిష్యత్తులో కచ్చితంగా గెలుస్తాననే ధీమాను కల్పించాడు.


గురువారం మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో జరిగిన ట్రైబ్రేక్‌లో ప్రజ్ఞానంద పోరాడి ఓడాడు. ర్యాపిడ్‌ రౌండ్‌లో మొదటి 25+10 గేమ్‌లో ఓటమి చవిచూశాడు. తెల్ల పావులతో రంగంలోకి దిగిన అతడు సమయం గడిచేకొద్దీ ఇబ్బంది పడ్డాడు. కార్ల్‌సన్‌ ఎత్తులకు పైఎత్తులు వేయలేకపోయాడు. దాంతో సమయం మించిపోయింది. సాధారణంగా తెల్ల పావులతో ఆడేటప్పుడు ప్రగ్గూ కొద్దిగా వెనుకంజ వేస్తాడు. ప్రత్యర్థిని ఉచ్చులో బిగించడానికి ఆలోచనలు రావని అతడే చెప్పాడు.


టైబ్రేక్‌ మొదటి గేమ్‌ ఓడిపోవడంతో ప్రజ్ఞానందకు రెండో దాంట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్ల కుర్రాడిపై ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆధిపత్య ఒత్తిడి కనిపించింది. తనకు బలమైన నల్లపావులతో ఆడుతుండటంతో ఏదైనా మ్యాజిక్‌ చేయకపోతాడా అని అభిమానులు ఆశించారు. మొదట్లో ప్రత్యర్థికి దీటుగా ఎత్తులు వేసినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత అనూహ్యంగా ఒత్తిడిలోకి జారుకున్నాడు.


అత్యంత వేగంగా పావులు కదుపుతున్న కార్ల్‌సన్‌ను అడ్డుకోవడంలో ప్రజ్ఞానంద విఫలమయ్యాడు. ప్రత్యర్థి సిసిలియన్‌ డిఫెన్స్‌ వ్యూహానికి అతడి వద్ద జవాబు లేకుండా పోయింది. తెల్ల పావులతో ఆడేవాళ్లకి సిసిలియన్‌ డిఫెన్స్‌ అత్యంత రక్షణాత్మకంగా ఉంటుంది. ఆ తర్వాత రెండు మూడు ఎత్తులు వేసిన ప్రగ్గూ ఇక విజయం కష్టమేనని భావించాడు. పది నిమిషాలు ఉండగానే గేమ్‌ డ్రా చేసుకుంటానని మాగ్నస్‌ను కోరాడు. అతడూ అంగీకరించడంతో మ్యాచ్‌ ముగిసింది.


ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చదరంగ ప్రపంచకప్‌ గెలవడం ఇదే తొలిసారి. ఇక ప్రజ్ఞానంద భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారాడు. ఈ విజయంతో విజేత మాగ్నస్ కార్ల్‌సన్‌కు    ఏకంగా 1.1 లక్షల యూఎస్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.90.9 లక్షలు) లభించాయి. రన్నరప్‌ ప్రగ్గూకు 80 వేల డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.66.13 లక్షలు) వచ్చాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌ మనీ రూ.15.13 కోట్లు.


ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్ గేమ్  ఉత్కంఠభరితంగా సాగింది. టైటిల్‌ కోసం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో భారత చెస్ సంచలనం ప్రజ్ఞానంద గట్టిగా పోటీ పడ్డాడు. బుధవారం వీరిద్దరూ వరుసగా రెండు క్లాసిక్ గేములను డ్రాగా ముగించారు. తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్‌ మొదటి నుంచి డ్రాను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఎత్తులు వేశాడు. నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కూడా సైతం కార్ల్‌సన్‌కు దీటుగా పావులు కదిపాడు. 


ఈ ఫైనల్ మొదటి నుంచి మాగ్నస్ కార్ల్‌సన్ పోరును టైబ్రేక్‌కు మళ్లించేందుకే ప్రయత్నించాడు. సెమీస్‌ తర్వాత కలుషిత ఆహారం తిని అనారోగ్యం బారిన పడ్డానని చెబుతూ మాగ్నస్ కార్ల్‌సన్‌ గేమ్‌ను టై బ్రేక్ వైపు తిప్పేందుకు యత్నించాడు. ఒక రోజు ఆగితే తనకు మరింత శక్తి వస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో తలపడవచ్చన్నది కార్ల్‌సన్ వ్యూహం. అయితే ప్రజ్ఞానంద కూడా దీన్ని పసిగట్టినట్లు ముందు నుంచే రక్షణాత్మకంగా వ్యవహరించాడు. 


30 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు అంగీకరించారు. రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్‌సన్‌ ఇద్దరూ 1-1తో సమానంగా ఉన్నారు. గురువారం నిర్వహించిన ట్రైబేక్లో మాగ్నస్ గెలిచాడు.


Also Read: ఆసియాకప్‌ ముంగిట కోహ్లీ సైలెంట్‌ వార్నింగ్‌! 17.2 స్కోర్‌ చేసేశాడోచ్‌!