Virat Kohli:


రికార్డులు సృష్టించడం.. వాటిని బద్దలు కొట్టడం విరాట్‌ కోహ్లీకి కొత్తేం కాదు! వికెట్ల మధ్య పరుగులు తీయడం.. బ్యాటుతో బౌండరీలు బాదడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. టీమ్‌ఇండియా ఫిట్‌నెస్‌ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఘనతా అతడికే చెందుతుంది.


టీమ్‌ఇండియాకు ఆడుతున్న తొలినాళ్లలో విరాట్‌ కోహ్లీ ఎక్కువగా బ్యాటింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఎప్పుడైతే కీలక ఆటగాడిగా ఎదిగాడో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఆటగాళ్లు అలసిపోకుండా ఉండాలంటే దేహ దారుఢ్యం పెంచుకోవడం అవసరమని గ్రహించాడు. విదేశాల్లో అనుసరిస్తున్న యో యో టెస్టును ఇక్కడా అమలయ్యేలా చేశాడు. ఇతరులకు చెప్పడమే కాకుండా తానే సొంతంగా ఫిట్‌నెస్‌కు అంకితమయ్యాడు. ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. జట్టులో ఆడాలంటే యోయో కచ్చితంగా పాస్‌ అవ్వాలన్న రూల్‌ తీసుకొచ్చాడు.


అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 15 ఏళ్లు అవుతున్నా విరాట్‌ కోహ్లీకి అలుపు లేదు. మరింత మెరుగ్గా ఉండాలన్న కసి కనిపిస్తోంది. అందుకే ఆసియాకప్‌ ముందు నిర్వహించిన యోయో టెస్టులో రికార్డు సృష్టించాడు. ఏకంగా 17.2 స్కోర్‌ సాధించాడు. సాధారణంగా ఈ టెస్టులో 16.5 దాటితేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది ఇంత స్కోర్‌ వచ్చిందంటే మాటలు కాదు. అందుకే తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.


'కోన్స్‌ మధ్య నిర్వహించిన యోయో టెస్టును 17.2 స్కోర్‌తో ముగించినప్పుడు ఉండే ఆనందం ఇదీ' అని విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. తన సిక్స్‌ ప్యాక్‌ దేహంతో తీసుకున్న చిత్రాన్ని ఇందుకు జత చేశాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు.


ఆసియాకప్‌ 2023 కోసం బీసీసీఐ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ ఇందుకు వేదిక. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇషాన్‌ కిషన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ మరో మూడు రోజుల్లో వీరితో జత కలుస్తారు.




రెండు రోజుల క్రితమే ఆసియాకప్‌ కోసం టీమ్‌ఇండియాను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 'మేం 18 మందిని ఎంపిక చేశాం. ప్రపంచకప్‌లోనూ దాదాపుగా వీళ్లే ఉంటారు. గాయాల నుంచి కోలుకొని కొందరు కీలక ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. వాళ్లు అంచనాలు అందుకుంటారని మా విశ్వాసం. ఆసియాకప్‌లో వారికి కొన్ని మ్యాచులు దొరుకుతాయి. ఐసీసీ ప్రపంచకప్‌నకు ముందు చిన్న క్యాంప్‌ ఏర్పాటు చేస్తాం. ఏదేమైనా అప్పుడూ ఈ ఆటగాళ్లే ఉంటారు' అని చీఫ్ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నాడు.


ఆసియాకప్‌ ఈ నెల 30 నుంచి మొదలవుతుంది. పాకిస్థాన్‌, శ్రీలంకలో మ్యాచులు జరుగుతున్నాయి. భారత్‌ అన్ని మ్యాచులను శ్రీలంకలోనే ఆడుతుంది. సెప్టెంబర్‌ 2న పల్లెకెలెలో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌తో తలపడుతుంది.


భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ


రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌