R Praggnanandhaa: ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ రన్నర‌ప్ ప్రజ్ఞానంద‌, అతని కుటుంబానికి టెక్ దిగ్గజం ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే బ‌హుమ‌తి ప్రకటించారు. 18 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద‌ విశ్వవేదిక‌పై భారత ఖ్యాతిని చాటాడు. చిన్న వయసులో ప్రపంచ కప్‌కోసం పోరాడిన ఆటగాడిగా అందరి మన్ననలు అందుకున్నారు. ఫిడే వరల్డ్ కప్‌లో జగజ్జేత మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడి రన్నర్‌గా నలిచాడు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద‌ కుటుంబానికి ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే బ‌హుమ‌తి అందివ్వనున్నారు. కొత్త ఎల‌క్ట్రిక్ కారును  ప్రజ్ఞానంద‌ కుటుంబానికి అందించనున్నారు. ఈ విష‌యాన్ని ఆనంద్ మ‌హీంద్ర స్వయంగా సోష‌ల్ మీడియాలో వెల్లడించారు. 


‘ ప్రపంచ క‌ప్‌లో రన్నర‌ప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద‌కు థార్ కారు గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని చాలామంది న‌న్ను అడిగారు. అయితే నా మ‌న‌సులో మ‌రో ఆలోచ‌న ఉంది. త‌ల్లిదండ్రులు త‌మ పిల్లల్ని చెస్ ఆడేలా ప్రోత్సహించేలా చేయాల‌ని కోరుతున్నా. వీడియో గేమ్స్ బ‌దులు పిల్లలకు న‌చ్చిన ఆట‌ల్లో అడుగుపెట్టనివ్వండి. అది ఒక‌రకంగా వాళ్ల అంద‌మైన భ‌విష్యత్తుకు పెట్టుబ‌డి లాంటిది. ఎలాగంటే.. ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌లా. అందుక‌ని నేను ప్రజ్ఞానంద త‌ల్లిదండ్రులు నాగ‌ల‌క్ష్మి, ర‌మేష్ బాబుల‌కు XUV4OO EV కారును బ‌హుమ‌తిగా ఇస్తున్నా.  త‌మ కొడుకు క‌ల‌ను గుర్తించి, అత‌డికి మ‌ద్దతుగా నిలిచినందుకు వారికి మా కృత‌జ్ఞత‌లు’ అని మ‌హీంద్ర త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 






క్రీడాకారులను ప్రోత్సహించడంతో ఆనంద్ మహీంద్ర ముందుంటారు. గతంలో చాలా మంది ఆటగాళ్లకు ఆయన కానుకలు అందించారు. ప్రపంచ వేదిక‌ల‌పై భార‌త దేశం గ‌ర్వప‌డేలా చేసిన ప‌లువురు క్రీడాకారుల‌కు మ‌హీంద్ర ఇప్పటికే థార్ కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఆ జాబితాలో తెలంగాణ‌ బాక్సర్ నిఖ‌త్ జ‌రీన్, క్రికెట‌ర్ న‌ట‌రాజ‌న్ ఉన్నారు.


తుది పోరులో మాగ్నస్ కార్ల్‌స‌న్‌తో తలపడిన ప్రజ్ఞానంద
అజ‌ర్‌బైజాన్‌లో ఈ నెల 24న మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో జరిగిన ట్రైబ్రేక్‌లో ప్రజ్ఞానంద పోరాడి ఓడాడు. ర్యాపిడ్‌ రౌండ్‌లో మొదటి 25+10 గేమ్‌లో ఓటమి చవిచూశాడు. తెల్ల పావులతో రంగంలోకి దిగిన అతడు సమయం గడిచేకొద్దీ ఇబ్బంది పడ్డాడు. కార్ల్‌సన్‌ ఎత్తులకు పైఎత్తులు వేయలేకపోయాడు. టైబ్రేక్‌ మొదటి గేమ్‌ ఓడిపోవడంతో ప్రజ్ఞానందకు రెండో దాంట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు బలమైన నల్లపావులతో ఆడుతూ మొదట్లో ప్రత్యర్థికి దీటుగా ఎత్తులు వేసినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత అనూహ్యంగా ఒత్తిడిలోకి జారుకున్నాడు. కార్ల్‌సన్‌ను అడ్డుకోవడంలో ప్రజ్ఞానంద విఫలమయ్యాడు. పది నిమిషాలు ఉండగానే గేమ్‌ డ్రా చేసుకుంటానని మాగ్నస్‌ను కోరాడు. అతడూ అంగీకరించడంతో మ్యాచ్‌ ముగిసింది.