BWF World Championships 2023: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత స్టార్ షట్లర్  హెచ్ఎస్ ప్రణయ్ వరల్డ్ ఛాంపియన్‌లో పతకం గెలవాలన్న కలను నెరవేర్చుకున్నాడు. డెన్నార్క్ రాజధాని కోపెన్‌హగన్ వేదికగా  జరుగుతున్న  బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్స్ ఫైనల్ లో ప్రణయ్.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకున్నాడు.  శుక్రవారం  ముగిసిన  క్వార్టర్స్  పోరులో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ ప్రణయ్.. 13-21, 21-15, 21-16  తేడాతో డెన్మార్క్‌కే చెందిన వరల్డ్ నెంబర్ వన్ విక్టర్ అక్సెల్సన్‌ను ఓడించాడు.


విక్టర్‌తో  క్వార్టర్స్ పోరులో  తొలి గేమ్ ఓడిన  ప్రణయ్  పట్టు వదల్లేదు. తొలి గేమ్ ఓడినా రెండో గేమ్  మొదట్లో కూడా ప్రణయ్  1-7తో వెనుకబడ్డాడు. కానీ అద్భుతంగా పుంజుకున్న   అతడు..   ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా  రెండు గేమ్‌లను సొంతం చేసుకున్నాడు.   చివరి గేమ్‌లో ప్రణయ్, విక్టర్‌లు హోరాహోరిగా పోరాడినప్పటికీ భారత షట్లర్ ధాటికి   టాప్ సీడ్ విక్టర్ నిలువలేకపోయాడు.  వరుసగా పాయింట్లు సాధించి విక్టర్‌పై విక్టరీ కొట్టాడు. 


బీడబ్ల్యూఎఫ్  వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లందరూ నిష్క్రమించినప్పటికీ  ప్రణయ్.. దేశానికి పతకం ఖాయం చేశాడు. సెమీస్‌కు వెళ్లడంతో అతడు భారత అభిమానుల ఆశలను  సజీవంగా ఉంచాడు. పలు ప్రతిష్టాత్మక టోర్నీలలో ఫైనల్ గెలిచి ట్రోఫీలను సొంతం చేసుకుంటున్న ప్రణయ్.. ఇప్పటివరకూ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మెరువలేకపోయాడు. కానీ తాజాగా విక్టర్ పై విజయంతో ప్రణయ్.. ఆ లోటును తీర్చుకోనున్నాడు.  సెమీస్‌లో కూడా గెలిస్తే  అతడు  స్వర్ణం లేదా రజతం ఖాయం చేసుకుంటాడు.  సెమీస్‌లో ప్రణయ్.. నేడు థర్డ్ సీడ్  కునల్వుట్ వితిద్సరన్ (థాయ్‌లాండ్) తో తలపడనున్నాడు. కునల్వుట్ క్వార్టర్స్‌లో టి.డబ్ల్యూ వాంగ్‌ను ఓడించి సెమీస్‌కు చేరాడు.


 






ఈ  టోర్నీలో ప్రణయ్.. తొలి రౌండ్‌లో కొలిజొనెన్‌ను ఓడించగా  రెండో రౌండ్‌లో డ్వి వార్డొయొను, ప్రీ క్వార్టర్స్‌లో కె.వై. లోహ్‌ను ఓడించి  క్వార్టర్స్ చేరుకున్నాడు.  క్వార్టర్స్‌లో విక్టర్‌ను మట్టికరిపించి  సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.  ప్రణయ్ ఇటీవలే సిడ్నీ వేదికగా ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 


 






సాత్విక్ జోడీకి నిరాశ.. 


గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన  భారత  పురుషుల డబుల్స్ జోడీ  సాత్విక్ సాయిరాజు - చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది నిరాశ తప్పలేదు. క్వార్టర్స్  పోరులో  సాత్విక్ - చిరాగ్‌ల జోడీ.. 18-21, 19-21 తేడాతో  డెన్నార్మ్‌కు చెందిన  ఆస్ట్రప్ - అండర్స్  చేతిలో ఓటమిపాలైంది. ఆది నుంచి ఆధిక్యం కొనసాగించిన డెన్మార్క్ ధ్వయం..  సాత్విక్ - చిరాగ్‌లను ఓడించింది. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial