టీమ్‌ఇండియా సీనియర్‌ క్రికెటర్లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెకు షాక్‌! బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో వారికి డిమోషన్‌ తప్పదని సమాచారం. ప్రస్తుతం ఉన్న 'ఏ' కేటగిరీ నుంచి వారిని 'బి'కి మార్చబోతున్నారని తెలిసింది. రెండేళ్లుగా వారు ఫామ్‌లో లేకపోవడమే ఇందుకు కారణం. 2022 సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో వారికి బోర్డు షాకివ్వబోతోందని వార్తలు వస్తున్నాయి.


బీసీసీఐ మార్గనిర్దేశాల ప్రకారం ఆటగాళ్లను నాలుగు విభాగాలుగా విభజిస్తారు. అవి గ్రేడ్‌ ఏ+, గ్రేడ్‌ ఏ, గ్రేడ్‌ బి, గ్రేడ్‌ సి. అత్యున్నత గ్రేడ్‌లో ఉండే ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు వేతనం ఇస్తారు. ఆ తర్వాత కేటగిరీలో క్రికెటర్లకు రూ.5 కోట్లు వార్షిక వేతనం ఉంటుంది. ఆఖరి రెండు గ్రేడ్లకు రూ.3 కోట్లు, రూ.1 కోటి పారితోషికంగా అందిస్తారు.


హైదరాబాదీ యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ ప్రస్తుతం గ్రేడ్‌ సిలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అతడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాంతో అతడిని సి గ్రేడ్‌ నుంచి బి లేదా ఏలోకి మారుస్తారని అంచనా. ఆల్‌రౌండర్ అక్షర్‌ పటేల్‌ కూడా ఐదు వికెట్ల ఘనతలతో దూసుకెళ్తున్నాడు. అతడికి సి గ్రేడ్ నుంచి బికి ప్రమోట్‌ చేస్తారని సమాచారం. శ్రేయస్‌ అయ్యర్, మయాంక్‌ అగర్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి కుర్ర క్రికెటర్లకు కాంట్రాక్టుల్లో పదోన్నతి లభించొచ్చు.






ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా మాత్రమే ఏ+ విభాగంలో ఉన్నారు. ఏటా రూ.7 కోట్లు అందుకుంటున్నారు. 2022లోనూ వారు ఇదే కేటగిరీలో ఉండనున్నారు. ఇక అశ్విన్‌, జడేజా, కేఎల్‌ రాహుల్‌, రిషభ్ పంత్‌, మహ్మద్‌ షమి ఎప్పటిలాగే గ్రేడ్‌ ఏలో ఉండనున్నారు. అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా మాత్రమే ఏ నుంచి బికి వస్తారని తెలుస్తోంది.


'ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగియగానే ఆటగాళ్ల కాంట్రాక్టుల ముసాయిదా పూర్తైంది. త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. భారత క్రికెట్‌ ముందుకెళ్లాల్సి ఉంది. కొత్త ఆటగాళ్ల ప్రదర్శనలను పట్టించుకోకుండా ఉండలేం' అని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి.


అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా.. వీరిద్దరినీ రాహుల్‌ ద్రవిడ్‌ వారసులుగా భావించారు! అతడిలా జట్టును కాపాడతారని విశ్వాసించారు. అందుకు తగ్గట్టే వీరెన్నో మ్యాచుల్లో టీమ్‌ఇండియాను రక్షించారు. అనేక మ్యాచుల్లో గెలిపించారు. అలాంటి రెండేళ్లుగా నిలకడగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కీలకమైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో సులభంగా వికెట్‌ ఇచ్చేస్తున్నారు. భారత్‌లోనూ ఆశించిన మేర రాణించడం లేదు.


చివరి 12 నెలల్లో 14 మ్యాచులాడిన పుజారా సగటు 24.08గా ఉంది. 2019 నుంచి అతడు సెంచరీలే చేయలేదు. ఇక అజింక్య రహానె సగటు మరీ ఘోరం! 13 మ్యాచుల్లో 20 సగటు నమోదు చేశాడు. మూడు అర్ధశతకాలు చేయగా, 10సార్లు ఒకే అంకె స్కోరుకు పెవిలియన్‌ చేరుకున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీసులో 136 పరుగులు చేశాడు. అందుకే వీరిద్దరికీ తలుపులు మూసేయకుండా ఫామ్‌ అందుకొనేలా దేశవాళీ క్రికెట్‌ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.


Also Read: Yuvraj Blessed with Baby: ఫ్యాన్స్‌కు యువరాజ్ గుడ్‌న్యూస్.. తండ్రి అయ్యానని పోస్ట్ చేసిన మాజీ ఆల్ రౌండర్


Also Read: IND vs WI: విండీస్‌ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టు సంగతేంటి?