త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జట్టుకు మెంటార్‌గా BCCI భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని నియమించిన సంగతి తెలిసిందే. ధోనీని మెంటార్‌గా నియమించడం చెల్లదంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎమ్‌సీఏ) మాజీ సభ్యుడు సంజీవ్‌గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకే వ్యక్తి రెండు పదవుల్లో కొనసాగడం లోధా కమిటీ సంస్కరణలకు విరుద్ధని ఆయన అన్నారు. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ధోని నియామకం పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి రెండు వేర్వేరు పదవుల్లో కొనసాగడానికి వీల్లేదు. ఇప్పటికే ధోనీ IPLలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి, అలాంటప్పుడు ధోనీని టీ20 ప్రపంచకప్ మెంటార్‌గా నియమించడం చెల్లదని లేఖలో వివరించారు. దీనిపై స్పందించిన సౌరభ్ గంగూలీ... రెండు ప్రపంచకప్‌లు గెలిచిన ధోనీ అనుభవం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు కలిసొస్తుందనే ఉద్దేశంతోనే మెంటార్‌గా నియమించినట్లు స్పష్టం చేశారు. సంజీవ్ గుప్తా గతంలో కూడా ఆటగాళ్లపై ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదులు చాలానే చేశాడు.
బుధవారం టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన అనంతరం... మాజీ సారథి ధోనీని టీమిండియాకు మెంటార్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు. ఈ ప్రకటనపై యావత్తు భారతదేశం ప్రశంసలు కురిపించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్దు నెలకొల్పిన సంగతి తెలిసిందే.