దేశంలో పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
బంగాల్, అసోం, మహారాష్ట్ర;, మధ్య ప్రదేశ్ లో ఒక్కో రాజ్యసభ స్థానానికి, తమిళనాడులో రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు బిహార్ శాసనమండలిలో ఓ స్థానానికి కూడా అక్టోబర్ 4నే ఉప ఎన్నిక జరగనుంది.
బంగాల్ లో మానస్ రంజన్ భూనియా, అసోం నుంచి బిస్వజిత్ దైమరి, మధ్యప్రదేశ్ నుంచి థావర్ చంద్ గహ్లోత్, తమిళనాడు నుంచి కేపీ మునుస్వామి, వైతిలింగం రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నికలు వచ్చాయి. మహారాష్ట్రలో మాత్రం రాజీవ్ శంకర్ రావు మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభమై.. 22వ తేదీ వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ సెప్టెంబర్ 27. అక్టోబర్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అనంతరం ఓట్లను లెక్కించనున్నారు.