ఆ క్రికెట్ జట్టును ఒకప్పుడు పసికూన అని పిలిచేవారు. కానీ, ఇప్పుడు ఆ జట్టంటే మిగతా జట్లకు కాస్త భయం పట్టుకుంది. ఇంతకీ ఏదా జట్టు అనే కదా మీ సందేహం. అదే బంగ్లాదేశ్ జట్టు. ఇటీవల బంగ్లాదేశ్ జట్టు క్రికెట్లో సాధిస్తోన్న విజయాలు మామూలుగా లేవు. మొన్నటికి మొన్న ఐదు ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన ఆస్ట్రేలియాను చిత్తు చేసి 5 టీ20ల సిరీస్‌ను ఏకంగా 4-1తో ఎగరేసుకుపోయింది. 










తాజాగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20లోనూ విజయం సాధించింది. సెప్టెంబరు 1న ఢాకా వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. అంతర్జాతీయ T20 క్రికెట్‌ చరిత్రలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌‌కి ఇదే  తొలి విజయం. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌ల్లో కివీస్‌ చేతిలో ఓడిన బంగ్లా.. 11వ పోరులో గెలిచింది.






అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. బంగ్లా బౌలర్ల దెబ్బకు 16.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. నసుమ్‌ అహ్మద్‌ (2/5), షకిబ్‌ (2/10), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3/13), మహ్మద్‌ సైఫుద్దీన్‌ (2/7) విజృంభించారు. బంగ్లా 15 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. 


టీ20ల్లో కివీస్‌కిదే స్వల్ప స్కోరు


అంతర్జాతీయ టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ ఇంత స్వల్ప స్కోరు సాధించడం ఇది రెండోసారి. గతంలో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో కివీస్ 60 పరుగులే చేసింది.  






ఆల్ రౌండర్ షకీబ్ వండర్స్ 
బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ఈ మ్యాచ్లో మాయ చేశాడు. మొదట బౌలింగ్ చేసిన అతడు కేవలం 10 పరుగుల ఇచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 25 పరుగులు సాధించాడు. దీంతో అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. 


ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఈ రోజు జరగనుంది. మరి, ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.