ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌(Australian Open 2024)లో మాజీ ఛాంపియన్‌ నవోమి ఒసాకా(Naomi Osaka)కు భారీ షాక్‌ తగిలింది. 15 నెలల విరామం తర్వాత టెన్నిస్‌ రాకెట్‌ పట్టి తిరిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరిన ఒసాకాకు నిరాశే ఎదురైంది. కొద్దిరోజుల క్రితమే కూతురుకు జన్మనిచ్చి ఆస్ట్రేలియా ఓపెన్‌ ద్వారా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలకు రీఎంట్రీ ఇచ్చిన ఒసాకా.. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 


మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 6-4, 7-6 (7/2) తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన కరోలిన్‌ గార్సియా (ఫ్రాన్స్‌) చేతిలో ఒసాకా ఓటమిపాలైంది. రెండు సెట్లతో పాటు టై బ్రేక్‌లోనూ ఒసాకా తన మార్కును చూపలేకపోయింది. తొలి సెట్‌ గెలిచిన జోష్‌లో ఉన్న కరోలినా.. ఒసాకా రెండో సెట్‌లో ప్రతిఘటించినా నియంత్రణ కోల్పోకుండా ఆడింది. మ్యాచ్‌ మొత్తం ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయంతో ఫ్రెంచ్‌ క్రీడాకారిణి.. రెండో రౌండ్‌కు చేరింది. సెకండ్‌ రౌండ్‌లో గార్సియా.. మగ్డలెనా ఫ్రెచ్‌ (పొలాండ్‌)తో తలపడనుంది. మానసిక సమస్యలతో ఒసాకా 2022 సెప్టెంబరులో ఆటకు దూరమైంది. గత జులైలో ఆడబిడ్డకు జన్మనిచ్చిచ్చిన ఆమె ఇటీవల జరిగిన బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించింది. 2019, 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్.. 2018, 2020లో యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది.


మార్కెటా అవుట్‌
ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. నిరుడు వింబుల్డన్ చాంపియ‌న్ మార్కెటా ఒండ్రుసోవా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్టింది. ఈసారి ఫేవ‌రేట్ల‌లో ఒక‌రైన ఒండ్రుసోవా  93వ ర్యాంక‌ర్ డ‌యానా య‌స్త్రెమ్‌స్కా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. వ‌రుస సెట్లలో ఆధిప‌త్యం చెలాయించిన ఉక్రెయిన్ క్వాలిఫ‌య‌ర్ డ‌యానా 6-1, 6-2తో వింబుల్డన్ విజేత‌ను మ‌ట్టిక‌రిపించింది. డ‌యానా టాప్ -10 క్రీడాకారిణుల‌పై నాలుగో విజ‌యం న‌మోదు చేసింది. 


ముర్రేకు షాక్‌
వింబుల్డన్ విజేత మ‌ర్కెట ఒండ్రుసోవా తొలి రౌండ్‌లోనే పరాజయం పాలై సంచలన నమోదు అవ్వగా  ఇప్పుడు బ్రిట‌న్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే కూడా వెనుదిరిగాడు. ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన ముర్రే 13 ఏళ్లలో రెండో సారి రెండో రౌండ్‌కు చేరకుండానే వెనుదిరిగాడు. ఐదుసార్లు ఫైన‌లిస్ట్ అయిన‌ ముర్రేను అర్జెంటీనాకు చెందిన‌ థామ‌స్ మార్టిన్ ఎట్జెవెర్రీ అవ‌లీల‌గా ఓడించాడు. రెండు గంట‌ల 23 నిమిషాల పాటు జ‌రిగిన పోరులో 32వ ర్యాంక‌ర్ థామ‌స్ ధాటికి ముర్రే నిల‌వలేక‌పోయాడు. తొలి సెట్ నుంచి వెన‌క‌బ‌డిన బ్రిట‌న్ స్టార్ 4-6, 2-6, 2-6తో మ్యాచ్ చేజార్చుకున్నాడు. దాంతో, కెరీర్ చివ‌ర్లో గ్రాండ్‌స్లామ్ గెల‌వాల‌నుకున్న ముర్రే క‌ల చెదిరింది. ముర్రే లాంటి లెజెండ‌రీ ఆట‌గాడితో త‌ల‌ప‌డ‌డం ఎప్పుడూ క‌ష్టంగానే ఉంటుందని గెలిచిన అనంతరం థామ‌స్  తెలిపాడు . బ్రిట‌న్‌లో టెన్నిస్‌కు క్రేజ్ తీసుకొచ్చిన‌ ముర్రే ఇప్పటివ‌ర‌కూ మూడు గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లు సాధించాడు. 2005లో అరంగేట్రం చేసిన ముర్రే ఖాతాలో 46 సింగిల్స్ టైటిళ్లు, 14 మాస్ట‌ర్స్ 1000 టైటిళ్లు ఉన్నాయి. అంతేకాదు ప్రతిష్ఠాత్మక‌ ఒలింపిక్స్‌లో రెండు బంగారు ప‌త‌కాలు కూడా గెలిచాడు.