టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడటానికి సర్వం సిద్ధం అయింది. అందరూ ఈ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌లా చూస్తుంటే.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం ప్రియమైన మిత్రుల మధ్య పోరులా చూస్తున్నారు. ఎందుకంటే సన్‌రైజర్స్ జట్టుకు ఈ సీజన్ ముందు వరకు కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ రెండు కళ్ల లాంటి వారు. ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ డేవిడ్ వార్నర్‌ను ఎంతగానో అభిమానిస్తారు. మరి ఈ మ్యాచ్‌లో వారి పోరును అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి.


ఇప్పటికే కొంతమంది అభిమానులు విలియమ్సన్ ఆర్మీ, వార్నర్ సేనలుగా విడిపోయి.. వారికి నచ్చిన ఆటగాళ్లు ఉన్న జట్టుకు సపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? వీరిద్దరిలో ఎవరు రాణిస్తారన్నది ప్రస్తుతం అభిమానులందరికీ ప్రశ్నలా మారింది.


ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి. రెండు జట్లూ ఆయా గ్రూపుల్లో రెండో స్థానాల్లోనే ఉండటం విశేషం. గ్రూప్-1లో మొదటి స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించగా.. గ్రూప్-2లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది.


ఈ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున 236 పరుగులతో డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. న్యూజిలాండ్ తరఫున 197 పరుగులతో డేరిల్ మిషెల్ అత్యధిక పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ జట్టు నుంచి దాదాపు బయటకు వచ్చేశాక డేవిడ్ వార్నర్ ఈ వరల్డ్ కప్‌లో విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్‌పై 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన వార్నర్, సెమీస్‌లో పాకిస్తాన్‌పై 49 పరుగులు సాధించాడు. సూపర్ 12 మ్యాచ్‌లో శ్రీలంకపై కూడా 65 పరుగులు చేశాడు.


ఇక కేన్ విలియమ్సన్ ప్రదర్శన ఈ వరల్డ్ కప్‌లో అంత ఆశాజనకంగా లేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 131 పరుగులు మాత్రమే సాధించిన కేన్ మామ అత్యధిక స్కోరు 131 పరుగులు మాత్రమే. స్ట్రైక్‌రేట్ 94.24 మాత్రమే. డేవిడ్ వార్నర్ స్ట్రైక్ రేట్ మాత్రం ఏకంగా 148.42 ఉండటం విశేషం.


2021 ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ ఆటతీరు కాస్త నిరాశపరిచే విధంగా ఉండటంతో యూఏఈలో జరిగిన మ్యాచ్‌ల్లో తనకు ఆడటానికి అవకాశం దక్కలేదు. డేవిడ్ వార్నర్ కూడా సన్‌రైజర్స్ తనను రిటైన్ చేయదేమో అని అభిప్రాయపడ్డాడు. కొత్త ఫ్రాంచైజీ కోసం సిద్ధం అవుతున్నానని, కానీ తన మనసంతా సన్‌రైజర్స్ జట్టు దగ్గరే ఉందన్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో డేవిడ్ సూపర్ ఫామ్‌తో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ మనసు మార్చుకుని వార్నర్ భాయ్‌కి మరో అవకాశం ఇస్తుందేమో చూడాలి!


Also Read: Indian Team Squad: 'హిట్‌ మ్యాన్‌' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్‌ సిరీసుకు జట్టు ఎంపిక


Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !


Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి