Asian Hockey 5s World Cup Qualifiers: ఓమన్ లోని సలాల వేదికగా జరుగుతున్న Asian Hockey 5s World Cup Qualifiersలో భారత హాకీ జట్టు గోల్స్ జాతర చేసుకుంటున్నది. మలేషియా, జపాన్‌లపై భారత్ ఘన విజయాలు సాధించింది. తొలుత భారత్ 7-5 తేడాతో మలేషియాను ఓడించింది. ఆ తర్వాత జపాన్‌పై ఏకంగా 35 గోల్స్ చేసింది. జపాన్ తరఫున ఒకే ఒక్క గోల్ నమోదైంది. వరుసగా రెండు విజయాలతో భారత్.. ఎలైట్ గ్రూప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుని సెమీస్‌కు చేరుకుంది.
మలేషియాతో పోరులో భారత జట్టు మలేషియాతో గెలిచినా ప్రత్యర్థి కూడా ధీటుగానే బదులిచ్చింది. భారత్ తరఫున గుర్జోత్ సింగ్.. 7, 11, 17, 29, 30 వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. మహిందర్ సింగ్ 12వ నిమిషంలో, మహ్మద్ రహీల్ 21వ నిమిషంలో గోల్ కొట్టారు. మలేషియా తరఫున అరిఫ్ ఇషాక్ (6వ నిమిషంలో) కెప్టెన్ ఇస్మాయిల్ అబు (7వ నిమిషంలో) గోల్స్ చేశారు. ఆ తర్వాత మహ్మద్ దిన్ (8), కమారుద్దీన్ (26), శ్యార్మన్ (30) గోల్స్ సాధించి భారత్ కు ధీటుగా ఆడినా చివర్లో భారత దూకుడుకు తలొగ్గారు.
జపాన్‌ను చిత్తుగా ఓడించి..
మలేషియాతో మ్యాచ్ ముగించిన తర్వాత జపాన్‌ను భారత ఆటగాళ్లు ఆటాడుకున్నారు. రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో మహీందర్ సింగ్ పది గోల్స్ కొట్టగా .. మహ్మద్ రహీల్ ఏడు గోల్స్, పవన్ రాజ్‌బర్ ఐదు, గుర్జోత్ సింగ్ ఐదు, సుఖ్వీందర్ నాలుగు, కెప్టెన్ మన్‌దీప్ మోర్ మూడు గోల్స్ కొట్టారు. జుగ్‌రాజ్ సింగ్ ఒక్క గోల్ చేశాడు. జపాన్ తరఫున మసటక కొబొరి ఒక్కడే ఒక్క గోల్ కొట్టాడు.
ఆట ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు జపాన్ గోల్ పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఒకర్ని మించి మరొకరు గోల్స్ చేశారు. బంతి ఫీల్డ్‌లో కంటే గోల్ పోస్ట్‌లోనే ఎక్కువసేపు నిలిచింది. ఆట ప్రారంభమైన తొలి నిమిషయంలోనే మహిందర్ సింగ్ గోల్ చేశాడు. ఆ తర్వాత 3, 5, 6, 9, 15, 20, 24, 25, 29వ నిమిషాల్లో అతడు గోల్స్ సాధించాడు. అతడికి తోడుగా రహీల్, రాజ్‌బర్, గుర్జోత్ సింగ్, సుఖ్విందర్, మన్‌దీప్ కూడా జతకలవడంతో గోల్స్ జాతర సాగింది. జపాన్ ఆటగాడు మసటక 29వ నిమిషంలో ఒక్క గోల్ చేసి ఆ జట్టు ఖాతా తెరిచాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial