Asian Games 2023: భారత సీనియర్ ఫుట్‌బాల్ వెటరన్ సునీల్ ఛెత్రి త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలలో యువ భారత్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. ఛెత్రితో పాటు డిఫెండర్ సందేశ్ జింగాన్, ఫస్ట్ ఛాయిస్ గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు కూడా ఆసియా క్రీడలు ఆడనున్నారు. ఈ మేరకు 22 మందితో కూడిన జట్టును ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది.
చైనాలోని హాంగ్జో వేదికగా జరుగబోయే ఫుట్‌బాల్ క్రీడలకు భారత రెగ్యులర్ కోచ్ ఇగోర్ స్టిమాక్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అండర్ - 23 స్థాయిలో జరుగబోయే ఈ పోటీలలో ముగ్గురి ఎంపికలో మాత్రం వయో పరిమితి లేదు. దీంతో సీనియర్ జట్టులో ఆడే ఛెత్రి, సందేశ్ జింగాన్, గురుప్రీత్ సింగ్‌లు జట్టుతో చేరారు. గ్రూప్ - ఎలో ఉన్న భారత జట్టు.. చైనా, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో లీగ్ దశలో పోటీ పడనుంది.
ఆసియా క్రీడలలో మొత్తం 23 జట్లు పాల్గొంటుండగా అందులో జట్లను ఆరు గ్రూపులుగా విడదీశారు. గ్రూపు ఎ, బీ, సీ, ఈ, ఎఫ్ లలో నాలుగు దేశాలు ఉండగా గ్రూప్ - డీలో మాత్రం మూడు టీమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇదిలాఉండగా ఆసియా క్రీడలలో పాల్గొంటుండం భారత జట్టుకు 9 ఏండ్ల తర్వాత ఇదే ప్రథమం. బృందంగా ఆడే క్రీడలలో టాప్ - 8 ర్యాంక్ ఉంటేనే ఆసియా క్రీడలకు పంపాలని నిర్ణయించినా ఇటీవలి కాలంలో ఫుట్‌బాల్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది.
భారత ఫుట్‌బాల్ జట్టు :
గోల్ కీపర్స్ : గురుప్రీత్ సింగ్, గుర్మీత్ సింగ్, ధీరజ్ సింగ్
డిఫెండర్స్ : సందేశ్ జింగాన్ , అన్వర్ అలీ, నరేందర్ గెహ్లాట్, లాల్చుంగ్వంగ, ఆకాశ్ మిశ్రా, రోషన్ సింగ్, అషిష్ రాయ్
మిడ్ ఫీల్డర్స్ : జాక్సన్ సింగ్, సురేశ్ సింగ్, అపుయా రాల్టే, అమర్‌జిత్ సింగ్, రాహుల్ కెపి, నరోమ్ స మహేశ్ సింగ్
ఫార్వర్డ్స్ : శివ శక్తి నారాయణన్, రహీమ్ అలీ, సునీల్ ఛెత్రి, అనికెత్ జాధవ్, విక్రమ్ ప్రతాప్ సింగ్, రోహిత్ దాను
ఈ జట్టు ఎంపికపై కోచ్ స్టిమాక్ హర్షం వ్యక్తం చేశాడు. రెగ్యులర్ టీమిండియా మెంబర్స్ కంటే ఈ టీమ్‌లో చాలా మంది బెటర్ ప్లేయర్స్ ఉన్నారని, వారంతా ఆసియా క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial