అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారు ఆ బరువును తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో డైటింగ్ పద్ధతులను పాటిస్తున్నారు. ఇప్పుడు వాటర్ ఫాస్టింగ్ అనే నయా ట్రెండ్ వచ్చింది. కేవలం నీళ్లు తాగుతూ బరువు తగ్గడం అనేది దీని ప్రత్యేకత. అయితే వాటర్ ఫాస్టింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకుంటే ఆసుపత్రి పాలవ్వడం ఖాయం. ఒక మహిళ 11 రోజులు పాటు వాటర్ ఫాస్టింగ్ చేసి ఆసుపత్రిలో చేరింది. ఎలాంటి డైట్లు, ఉపవాసాలు పాటించినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది.
ఏమిటీ వాటర్ ఫాస్టింగ్?
వాటర్ ఫాస్టింగ్ అంటే నీళ్లు తాగుతూ బరువు తగ్గడం. రోజులో కొన్ని గంటల పాటు ఆహారాన్ని తీసుకోకుండా కేవలం నీళ్లను మాత్రమే తాగుతూ ఉండాలి. ఇతర ఆహారాలను తీసుకోకూడదు. రోజులో ఒక పూట భోజనం చేయడం, మిగతా సమయంలో నీళ్లు తాగడం ద్వారా బరువు తగ్గుతారు. నీళ్ళల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి ఆహారం తీసుకోకుండా కొన్ని గంటల పాటు ఉండటం వల్ల శరీరం శక్తి కోసం ఇతర మార్గాలను వెతుక్కుంటుంది. శరీరంలో నిల్వచేసిన కొవ్వు, కార్బోహైడ్రోట్లను వినియోగించుకోవడం మొదలు పెడుతుంది. మొదటగా శరీరం కార్బోహైడ్రోట్లను ఉపయోగించుకుంటుంది. తర్వాత కొవ్వును కరిగించి దాన్ని శక్తిగా మార్చుకొని వినియోగిస్తుంది. దీనివల్ల శరీరం త్వరగా బరువు తగ్గుతుంది.
ఫాస్టింగ్ చేసేటప్పుడు రోజంతా ఆహారం తినకుండా ఉండకూడదు. కొన్ని గంటల పాటు మాత్రమే ఆహారం తినకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. కానీ చాలామంది బరువు త్వరగా తగ్గాలన్న అత్యాశతో ఎక్కువ సమయం పాటు వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారు. దీని వల్ల వారి శరీరం అనారోగ్యాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. వాటర్ ఫాస్టింగ్‌ను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉదయం కొంత ఆహారాన్ని తిన్నాక మధ్యలో అంతా వాటర్ ఫాస్టింగ్ చేయాలి. మళ్లీ రాత్రికి కొంత ఆహారాన్ని తినాలి. పూర్తిగా ఆహారం తినడం మానెయకూడదు. అలాగే మధ్య మధ్యలో తేలికపాటి పండ్లను తినవచ్చు. అయితే పొట్ట నిండేటట్టు తినకూడదు. ఒక పండు వరకు తినవచ్చు.
కొంత సమయాన్ని నిర్ణయించుకొని ఆ సమయంలోనే వాటర్ ఫాస్టింగ్ చేయాలి. ఎక్కువ సమయం పాటు వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత అవకాశం ఉంది. అంటే పొటాషియం, సోడియంలలో అసమతుల్యత వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు విపరీతంగా నీళ్లు తాగేయకూడదు. సాధారణంగా ఎన్ని నీళ్లు తాగుతారో అలానే తాగాలి. అధికంగా తాగితే అసమతుల్యతలు ఏర్పడి ఇతర సమస్యలు వస్తాయి. రక్తప్రసరణ శరీరానికి తగ్గుతుంది. దీనివల్ల అవయవాలకు ఆక్సిజన్, పోషకాలు అందడం సరిగ్గా జరగదు. దీనివల్ల అలసట వచ్చి కళ్ళు తిరుగుతున్నట్టుగా అవుతారు. కాబట్టి అతిగా దేన్నీ పాటించకండి. వాటర్ ఫాస్టింగ్ రోజులు కొంత సమయం మాత్రమే చేయాలని గుర్తుపెట్టుకోండి. ఆహారంలో కొవ్వు ఉండే పదార్థాలను తినకుండా తాజా కూరగాయలతో వండిన ఆహారాలను తింటూ వ్యాయామం చేస్తే బరువు త్వరగా తగ్గుతారు. అలాగే ఒత్తిడి కూడా బరువును పెంచేందుకు సహకరిస్తుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. శరీరానికి తగినంత నిద్రను కూడా ఇవ్వండి.
Also read: గర్భనిరోధక మాత్రను వాడడం వల్ల హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువ?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.