వైద్యుల ప్రెస్క్రిప్షన్ లేకుండా గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో లభిస్తున్నాయి. అమెరికా సహా ప్రపంచంలోని 100 దేశాల్లో ఈ పిల్స్ మెడికల్ షాపుల్లో దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగించడం సులువు, కాబట్టి మహిళలు అధికంగా వీటిని వాడేందుకే ఇష్టపడుతున్నారు. గర్భనిరోధక మాత్రలను ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లతో తయారుచేస్తారు. మహిళల శరీరంలో ఈ రెండు హార్మోన్లు ఉంటాయి. అందుకే ఈ రెండు హార్మోన్లను గర్భనిరోధక ప్రక్రియలో ఉపయోగిస్తారు.


గర్భ నిరోధక మాత్రలను అధికంగా వాడితే హైబీపీ వచ్చే అవకాశం ఉందని కొందరు భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా  హైబీపీతో బాధపడుతున్న వారు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడాలా వద్దా అని సందేహంలో ఉంటారు. ఈ  గర్భ నిరోధక మాత్రలలో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం పిల్స్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రెండు కలిపి ఉంటాయి. ఇక రెండో రకం పిల్స్ లో కేవలం ప్రొజెస్టరాన్ మాత్రమే ఉంటాయి. ఈస్ట్రోజన్ ఉన్న మాత్రలను ఉపయోగిస్తే  రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న మహిళలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్  రెండూ కలిపి ఉన్న పిల్స్ కు దూరంగా ఉంటే ఉత్తమం. ప్రొజెస్టరాన్ ఉపయోగించిన గర్భనిరోధక పిల్స్‌ని వాడితే మంచిది. ఇది ఎలాంటి అధిక రక్తపోటును పెంచదు. నిజానికి గర్భనిరోధక మాత్రలను తరచూ వాడడం కూడా ఉత్తమమైన పద్ధతి కాదు. వాటి బదులు కాపర్ టీ లూప్స్, హార్మోనల్ ఐయూడీలు ఉపయోగించడం మంచిది.


గర్భనిరోధక మాత్రల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉన్న పిల్స్‌ను వాడితే రక్తం గడ్డకట్టే వ్యాధి, అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రొజెస్టరాన్‌లతో కూడిన పిలిచినా వాడితే వికారం, తలనొప్పి, ఋతుస్రావం సరిగా జరగకపోవడం, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి గర్భనిరోధక మందులను అధికంగా వాడకుండా ఇతర పద్ధతులను పాటించడం చాలా ఉత్తమం. ఒక ఏడాది లేదా రెండేళ్లు పిల్లలు వద్దు అనుకుంటే కాపర్ టీ లూప్స్‌ను వేయించుకుంటే మంచిది. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఈ లూప్స్‌ను తొలగిస్తారు.


ఈస్ట్రోజన్ కలిగిన గర్భనిరోధక మాత్రలను వాడుతూ ధూమపానం కూడా చేస్తే అలాంటి స్త్రీలలో రక్తం గడ్డ కట్టడానికి అవకాశం ఎక్కువ. ఇది ప్రాణాంతకంగా మారుతుంది. గుండెకు రక్తం అందక గుండె వైఫల్యం చెందే అవకాశం ఉంది. కాబట్టి గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడడం తగ్గించుకోవాలి. దీర్ఘకాలంగా వీటిని వాడితే కచ్చితంగా ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.



Also read: పెద్దలకు మద్యం అలవాటు ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ


Also read: తరచూ కాలు జారినట్టు అనిపిస్తోందా? ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.