Asian Games 2023 Medal Tally: ఏసియన్ గేమ్స్ - 2023లో వంద పతకాలు  సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత్.. ఆ దిశగా విజయవంతంగా సాగుతోంది.   ఆరంభ రోజు అయిన ఆదివారం ఐదు పతకాలు నెగ్గిన భారత్..  రెండో రోజు మరో ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది.  షూటింగ్‌లో భాగంగా భారత  షూటర్లు సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గారు. ఆసియా క్రీడలలో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం కావడం గమనార్హం. 


రోయర్స్ సూపర్


ఆదివారం రోయింగ్‌లో రెండు రజతాలు ఓ కాంస్యం నెగ్గిన  భారత్.. నేడూ అదరగొట్టింది.   రోయింగ్ మెన్స్  క్వాడ్రపుల్ స్కల్స్ ఈవెంట్‌లో భాగంగా  మన ఆటగాళ్లు సత్నాం సింగ్, ప్రమిందర్ సింగ్, జకర్ ఖాన్, సుఖ్‌మీత్ సింగ్‌లు  కాంస్యం నెగ్గారు. అంతేగాక మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్, మెన్స్ కాక్స్‌డ్ ఎయిట్ విభాగాల్లో రజత పతకాలను కూడా గెలుచుకుంది.  ఈ విభాగంలోనే  భారత్‌కు ఐదు పతకాలు రావడం గమనార్హం. 






షూటింగ్‌లో పసిడి 


భారత్ ఈసారి కచ్చితంగా అధిక పతకాలు సాధిస్తుందని ఆశిస్తున్న షూటింగ్ విభాగంలో  మెరుగైన ఫలితాలే వచ్చాయి.  ఆసియా క్రీడలలో భారత్‌కు తొలి స్వర్ణం వచ్చింది ఈ విభాగంలోనే..  పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం నెగ్గింది.  ఇక ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో  రజతం గెలుచుకున్న భారత్.. 10 మీటర్ల  మెన్స్ ఎయిర్ రైఫిల్ (ఐశ్వర్య  ప్రతాప్ సింగ్ తోమర్) ,  ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్, 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మెన్స్ టీమ్ ఈవెంట్లలో కాంస్య పతకాలు గెలుచుకుంది.  పురుషుల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌, ఐశ్వరీ తోమర్‌, దివ్యాన్ష్‌ పన్వర్‌ బృందం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్‌ పాటిల్‌, ఐశ్వరీ తోమర్‌, దివ్యాన్ష్‌ పన్వర్‌‌తో కూడిన బృందం ఫైనల్‌లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. 


టెన్నిస్‌లో షాక్


భారత టెన్నిస్ దిగ్గజం  రోహన్ బోపన్న - యూకీ బాంబ్రీ జోడీకి భారీ షాక్ తగిలింది.  రెండో రౌండ్‌లో ఈ జోడీ ఉజ్బెకిస్తాన్  ద్వయం సెర్గీ ఫోమిన్, కుమోయున్ సుల్తానోవ్ చేతిలో ఓడింది. ఉమెన్స్ సింగిల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన అంకితా రైనా ఉజ్బెకిస్తాన్ క్రీడాకారిణి సబ్రినాను ఓడించి  రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.  రామ్‌కుమార్ రామనాథన్, రుతుజా భోసాలె లు కూడా రెండో  రౌండ్  చేరారు. 


 






తాజా పతకాలతో  ఒక స్వర్ణం, మూడు రజతాలు,  ఆరు కాంస్యాలతో మొత్తంగా పది పతకాలు సాధించి  పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.   చైనా 45 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. కొరియా (18), జపాన్ (18), ఉజ్బెకిస్తాన్ (10), హాంకాంగ్ చైనా (10)లు భారత్ కంటే ముందున్నాయి.