అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. జేపీ ప్రభాకర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గరకు రాకుండా.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టు వెనక్కి పంపేస్తున్నారు.
పెద్దపప్పూరు మండలం తిమ్మంచెరువులో వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర కల్యాణ మండపానికి భూమి పూజ చేసేందుకు సిద్ధమయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆలయ కమిటీ సిబ్బందితో పాటు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. తనను హౌస్‌అరెస్ట్ చేయడంతో పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదంటూ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. దేవాలయం పరిధిలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో పలు అభివృద్ధి పనులకు జేసీ ప్రభాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే పోలీసులు మాత్రం అందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జేసీ ఇంటి దగ్గర పోలీసులు పెద్దసంఖ్యలో మోహరిచడంతో... ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. టీడీపీ కార్యకర్తలు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.