Asaduddin Owaisi Challenge: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆరోపించారు. 


‘మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో నాతో తలపడండి’ అని అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు చాలా విషయాలు చెబుతారని, కానీ ఆ పార్టీ హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదును కూల్చివేశారని ఓవైసీ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల తర్వాత ఒవైసీ ఈ సవాలు విసిరారు. 


బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి మతపరంగా దూషించిన ఘటనపై అసద్ మాట్లాడుతూ.. పార్లమెంటులో ముస్లింల సామూహిత హత్యలు జరిగే రోజు ఎంతో దూరం లేదన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. దీనిపై దేశ ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు. పార్లమెంటులో ముస్లిం ఎంపీ గురించి మాట్లాడిన బీజేపీ ఎంపీ తనతో వాదించలేరని, అందుకే కూర్చోమని చెప్పానని ఒవైసీ పేర్కొన్నారు.  


ఇటీవల తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఎంఐఎంపై విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని తెలిపారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, అధికార బీఆర్ఎస్‌తోనే కాదని, బీజేపీ, ఎంఐఎంపై పోరాడుతుందన్నారు. పేరుకే అవి మూడు పార్టీలు అని, కానీ అంతా ఒక్కటేనని రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలపై సీబీఐ, ఈడీ కేసులు లేవని రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ వారిని తమ సొంత మనుషులుగా భావిస్తున్నారని చెప్పారు. 


2022లోను రాహుల్‌కు సవాల్ విసిరిన ఓవైసీ
గత ఏడాది మే నెలలో సైతం అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరిరక్షించుకోవాలని ఎంఐఎం అధినేత ఓవైసీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చాలెంజ్ విసిరారు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో తెలియదని అన్నారు. ఇలా అయితే టీఆర్‌ఎస్‌(బీఆర్ఎస్)ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. 


హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్ నుంచి పోటీచేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని అన్నారు. ఇక్కడి ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలో కూడా రాహుల్‌కు తెలియదని ఓవైసీ ఎద్దేవా చేశారు. గత ఏడాది తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ టీఆర్‌ఎస్, బీజేపీతో సహా ఓవైసీని సవాల్ చేసేందుకే తాను తెలంగాణకు వచ్చానన్నారు. దీనికి ఓవైసీ కౌంటర్ ఇస్తూ రాహుల్ గాంధీకి సవాల్ చేశారు.