Asian Games 2023: గడిచిన మూడు నెలల కాలంలో రెండు కీలక టైటిళ్లు నెగ్గిన భారత ఫుట్‌బాల్ జట్టుకు క్రీడల మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌తో పాటు శాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచి జోరుమీదున్న భారత ఫుట్‌బాల్ జట్టును సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా క్రీడలకు పంపేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ అంగీకారం తెలపలేదు. దీంతో భారత ఫుట్‌బాల్ టీమ్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోనుంది.
ఎందుకు..?
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఏసియన్ గేమ్స్ - 2023కు భారత ఫుట్‌బాల్ టీమ్‌ను పంపించకపోవడానికి కారణముంది. ఆసియా క్రీడల్లో జరుగబోయే టీమ్ ఈవెంట్స్ పోటీలలో టాప్ - 8 ర్యాంకులో ఉన్న జట్లనే ఆసియా క్రీడలకు పరిగణించాలని క్రీడల మంత్రిత్వ శాఖ.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఎ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్) లకు లేఖ రాసింది. అయితే ఆసియాలో ఫుట్‌బాల్ ఆడే జట్లలో టాప్ -10 లో భారత్ లేదు. ప్రస్తుతం భారత ర్యాంకు 18గా ఉంది.
అయితే స్పోర్ట్స్ మినిస్ట్రీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాల్సిందిగా కోరతామని భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్)ను కోరనుంది. ఇదే విషయమై ఎఐఎఫ్ఎఫ్ సెక్రటరీ జనరల్ షాజీ ప్రభాకరన్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం కట్టుబడి ఉండాలి. ఏదేమైనా మేం ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతాం. భారత జట్టు గత కొంతకాలంగా బాగా రాణిస్తోంది. ఈ ఏడాది టీమిండియా పలు కీలక టోర్నీలలో గెలిచింది. ఇప్పుడిప్పుడే ఫుట్‌బాల్ కూడా మిగతా గేమ్స్ మాదిరిగా భారత్‌లో క్రేజ్ సంపాదించుకుంటున్నది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆటగాళ్లను నిరుత్సాహానికి గురిచేసేలా ఉంది..’ అని తెలిపాడు.
ఆసియా క్రీడలలో 2002 నుంచి ఫుట్‌బాల్ ఆడిస్తున్నారు. అయితే ఇందులో ఆడబోయేది అండర్ - 23 విభాగం వారే కావడం గమనార్హం. కానీ ప్రతి జట్టులో కనీసం ముగ్గురు.. 23 ఏండ్ల పైవారైనా అనుమతిస్తారు. దీని ప్రకారం ఈ ఏడాది కూడా భారత ఫుట్‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్ మార్గనిర్దేశకత్వంలో ఆసియా క్రీడలలో పాల్గొనే అండర్ - 23 జట్టును పంపించాలని ఎఐఎఫ్ఎఫ్ భావించింది. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకూ థాయ్‌లాండ్ వేదికగా జరిగే కింగ్స్ కప్ ముగిసిన తర్వాత అక్కడ్నుంచి నేరుగా హాంగ్జౌకు వెళ్తారని వార్తలు వచ్చాయి.
మరి ఆ టీమ్స్‌ను ఎందుకు పంపుతున్నారు?
కానీ తాజాగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఫుట్‌బాల్ క్రీడాకారులతో పాటు అభిమానులనూ నిరాశకు గురిచేసేదే.. ఫుట్‌బాల్ జట్టును టాప్ - 8 ర్యాంక్‌లో లేదని చైనాకు పంపడానికి నిరాకరించిన ఐవోఎ.. 15వ ర్యాంకు ఉన్న హ్యాండ్ బాల్ టీమ్‌కు, 21వ ర్యాంకు ఉన్న బాస్కెట్ బాల్ టీమ్‌కు, 11వ ర్యాంకు ఉన్న వాలీబాల్ టీమ్‌కు అంగీకారం తెలపడం విడ్డూరంగా ఉంది. మరి ఎఐఎఫ్ఎఫ్ వినతిని క్రీడా మంత్రిత్వ శాఖ ఏ మేరకు పరిగణిస్తుందో చూడాలి. 2018 ఆసియా క్రీడలలో కూడా ఐవోఎ.. ఇదే కారణం చూపి భారత ఫుట్‌బాల్ ఆడేందుకు అనుమతించలేదు.