Asian Games 2023: చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం జరిగిన రెండు ఈవెంట్లలో భారత్ కు అమ్మాయిలు బంగారు పతకాలు అందించారు. జావెలిన్ త్రో విభాగంలో భారత్ కు స్వర్ణం లభించింది. అన్ను రాణి జావెలిన్ త్రో ఫైనల్లో అత్యధిక దూరం బల్లెం విసిరి స్వర్ణం కైవసం చేసుకుంది. 62.92 మీటర్లు విసిరి అగ్ర స్థానంలో నిలిచి త్రివర్ణ పతాకం రెపరెపలాడించింది.
భారత అథ్లెట్ అన్ను రాణి రెండో ప్రయత్నం 61.28 మీటర్లు బళ్లెం విసిరి ఈ సీజన్ లో బెస్ట్ నమోదు చేసింది. మూడో ప్రయత్నంలో 59.24 మీటర్లకే పరిమితమైంది. నాలుగో ప్రయత్నంలో రికార్డు స్థాయిలో 62.92 మీటర్లు బళ్లెం విసిరి బంగారు పతకం సాధించింది.
పారుల్ చౌదరికి స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి అద్భుతం చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల రన్నింగ్ ఫైనల్ ను కేవలం 15 నిమిషాల 14.75 సెకన్‌లలో పూర్తిచేసింది. తద్వారా తొలి స్థానంలో నిలిచి భారత్ కు స్వర్ణాన్ని అందించింది. ఆసియా గేమ్స్ లో పారుల్ కు ఇది రెండో పతకం. నిన్న (అక్టోబర్ 2న) జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో పారుల్ చౌదరి రజతం నెగ్గడం తెలిసిందే. నేడు మరింత శ్రమించి గోల్డ్ మెడల్ తో దేశం గర్వించేలా చేసింది.
ఆసియా గేమ్స్ లో 5 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా 28 ఏళ్ల పారుల్ చౌదరి నిలిచింది. 15 నిమిషాల 15.34 సెకన్‌ల టైమింగ్‌తో రేసు పూర్తి చేసిన జపాన్ అథ్లెట్ హిరోనికా రిరికా రజతం సాధించగా, 15 నిమిషాల 23.12 సెకన్లలో రేసు ముగించిన కజకిస్తాన్ అథ్లెట్ కరోలిన్ చెప్‌కోయిచ్ కాంస్యంతో సరిపెట్టుకుంది.
2 రజతాలు..
పురుషుల డెకథ్లాన్ లో తేజస్విన్ శంకర్ రెండో స్థానంలో నిలిచాడు. 7666 పాయింట్లు సాధించి రజత పతకంతో మెరిశాడు. 1974 తరువాత డెకథ్లాన్ లో భారత్ సాధించిన తొలి పతకం ఇదే. 800 మీటర్ల పురుషుల ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన మహ్మద్ అఫ్సల్ భారత్ కు రజత పతకాన్ని అందించాడు. 1:48.43 టైమింగ్ తో రేసు పూర్తి చేశాడు.
బాక్సర్ నరేందర్ కాంస్యం నెగ్గాడు. 92 కేజీల పురుషుల సెమీ ఫైనల్లో కజకిస్తాన్ బాక్సర్ తో తలపడ్డాడు. మరో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో 16.68 మీటర్లు దూకి మూడో స్థానంలో నిలిచాడు. దాంతో భారత్ ఖాతాలో కాంస్య పతకం చేరినట్లయింది. ఆసియా క్రీడలలో భారత్ 69 పతకాలు సాధించగా.. అందులో 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలున్నాయి. నీరజ్ చోప్రాకు ఫైనల్లో తగ్గిందని చెప్పవచ్చు. పాక్ కు చెందిన జావెలిన్ త్రోయర్ గాయం కారణంగా వైదొలగడం కలిసొచ్చే అంశం.