Lokesh No Arrest :  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలతో పాటు సీఐడీ పోలీసులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు సంచలనంగా మారాయి. ఢిల్లీలో ఉన్న  నారా లోకేష్ ను అరెస్ట్ చేసి తీసుకు వచ్చేందుకు టీమ్ కూడా వెళ్లిందన్నారు. లోకేష్ కనిపించడం లేదని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ అరెస్టు చేయడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 


ఫైబర్ గ్రిడ్ ఎఫ్ఐఆర్‌లో అసలు లోకేష్ పేరు లేదన్న సీఐడీ                   


ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే లోకేష్‌ను ఇంతవరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒకవేళ చేరిస్తే ఆయనకు సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. 41 ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామన్నారు.  
 
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కేసులో పదో తేదీన లోకేష్ సీఐడీ విచారణ                  
 
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్‌ సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ  సిఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.  సిఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో   లోకేష్ సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  హెరిటేజ్ డాక్యుమెంట్లు అడిగారని.. లోకేష్ హెరిటేజ్‌లో షేర్ హోల్డర్లు మాత్రమేనన్నారు.  వాటిని లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని  సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, బుధవారమే  విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు.  అయితే అంత తొందర ఏముందని  లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.  ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి వరకూ అరెస్టు చేసే అవకాశం లేదు. 


స్కిల్ కేసులో ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు              


స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో  4వ తేదీ వరకూ అరెస్టు చేయకుండా సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో నారా లోకేష్ పేరు ఉందోలేదో స్పష్టత లేదు. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు చేర్చారో లేదో తేలియదు. ఈ అంశంపై తదుపరి విచారణ బుధవారం జరగనుంది. దీంతో నారా లోకేష్ అరెస్టుపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు సీఐడీ తీసుకునే అవకాశం లేదని భావించవచ్చు.