Asian Games 2023: 


ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్‌ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్‌ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఆతిథ్య చైనాను వెనక్కి నెట్టింది. హృదయ్‌ చెడ్డా, దివ్యకృతి సింగ్‌, అనుష అగర్వాల, సుదీప్తి హజేలాతో కూడిన జట్టు 209.205 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా (204.882 పాయింట్లు), హాంకాంగ్‌ (204.852 పాయింట్లు)ను రజతం, కాంస్యానికి పరిమితం చేసింది.




ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌లో భారత్‌కు ఇది నాలుగో బంగారు పతకం. అంతకు ముందు మూడు స్వర్ణ పతకాలను 1982 ఆసియా క్రీడల్లో గెలుచుకుంది. సెయిలింగ్‌లో టీమ్‌ఇండియా పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ రజత పతకం గెలుచుకుంది. కొద్దిసేపటి క్రితమే మరో రెండు పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి. పురుషుల విభాగంలో రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఎబాద్‌ అలీ ఆర్‌ఎస్ - X కేటగిరీలో, విష్ణు శరవణన్ ఐఎల్‌సీఏ విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య పతకాలు అందుకున్నారు.


భారత బాక్సర్ సచిన్‌ అదుర్స్‌ అనిపించాడు. రెండో రౌండ్‌లోకి ఎంటరయ్యాడు. 57 కేజీల విభాగంలో ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్‌పై 5-0 ఆధిక్యంతో విజయం సాధించాడు. ఇక 92 కేజీల విభాగంలో 16వ రౌండ్‌లో కర్గిస్థాన్‌ బాక్సర్ ఒముర్‌బెక్‌తో భారత బాక్సర్ నరేంద్ర తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఈస్పోర్ట్స్‌లో భారత ద్వయం అయాన్ బిస్వాస్, మయాంక్ అగర్వాల్ స్ట్రీట్‌ ఫైటర్ నాకౌట్‌ రౌండ్ల నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. టెన్నిస్‌లో సుమిత్‌ నగల్‌ మూడో రౌండ్‌లో తలపడుతున్నారు.


సాయంత్రం 4 గంటలకు భారత వాలీబాల్‌ జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. ప్రపంచ రాంకింగ్స్‌లో దాయాది మనకన్నా మెరుగ్గా ఉంది. ఆసియా క్రీడల్లో భారత్‌ 13 పతకాలు గెలిచి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది. అంతకు ముందు జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్సడ్‌ టీమ్‌ ఈవెంట్లో దివ్యాన్ష్‌ సింగ్‌, రమిత 18-16 తేడాతో కొరియా చేతిలో ఓటమి చవిచూశారు. కాస్తలో పతకం మిస్సయ్యారు.