Online Gaming Tax:
ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ (RMG) కంపెనీలకు జీఎస్టీ ఇంటెలిజెన్సీ (DGCI) డైరెక్టర్ జనరల్ అతిపెద్ద షాకిచ్చారు! వస్తు సేవల పన్ను బకాయిలు రూ.55,000 కోట్లు చెల్లించాలని డజనుకు పైగా కంపెనీలకు ముందస్తు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫాంటసీ స్పోర్ట్స్ వేదిక డ్రీమ్11కు ఏకంగా రూ25,000 కోట్లు చెల్లించాలని నోటీసులిచ్చారని తెలిసింది. బహుశా దేశంలో అత్యంత విలువైన పరోక్ష పన్ను నోటీసు ఇదేనని సమాచారం.
రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు నోటీసులు ఇంకా పెరుగుతాయని అంచనా. వీటి విలువ రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు DRC-01A ఫామ్‌ను జారీ చేసినట్టు తెలిసింది. జీఎస్‌టీ పరిధిలో దీనినే ముందుస్తు షోకాజ్ నోటీసు అంటున్నారు. అసలైన షోకాజ్ నోటీసుకు ముందు దీనిని జారీ చేస్తారు.
ప్లేగేమ్స్ 24x7, దాని అనుబంధ శాఖలు, హెడ్ డిజిటల్ వర్క్స్‌కు సైతం నోటీసులు వెళ్లాయని సమాచారం. మరిన్ని వివరాల కోసం సంప్రదించగా డ్రీమ్ 11, హెడ్ డిజిటల్ వర్క్స్ మాట్లాడేందుకు తిరస్కరించాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. కాగా ముందుస్తు షోకాజు నోటీసులపై డ్రీమ్11 బాంబే హైకోర్టుకు వెళ్లిందని సమాచారం.
విస్తృత చర్చల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్స్‌పై జీఎస్టీని 28 శాతానికి పెంచింది. ఈ మార్పు చేసిన కొన్ని రోజులకే డైరెక్టర్ జనరల్ నోటీసులు పంపించడం గమనార్హం. 'రూ.25,000 కోట్లు చెల్లించాలని డ్రీమ్11కు సోమవారం ముందస్తు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రమ్మీ సిర్కల్, మై11 సర్కిల్ మాతృసంస్థ ప్లేగేమ్స్ 24x7కు రూ.20,000 కోట్ల నోటీసు వచ్చింది. హెడ్ డిజిటల్ వర్క్స్‌కు రూ.5000 కోట్లు చెల్లించాలని నోటీసులు వచ్చింది' అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు మీడియాకు తెలిపారు.
గతంలో గేమ్స్ క్రాఫ్ట్ సంస్థ నుంచి రూ.21,000 కోట్లు డిమాండ్ చేస్తూ జీఎస్టీ నోటీసులు పంపించారు. అప్పటి వరకు ఇదే అతిపెద్ద నోటీసు. దీనిని గేమ్స్‌క్రాఫ్ట్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దాంతో సెప్టెంబర్ 6న హైకోర్టు ఆర్డర్‌ను క్వాష్ చేస్తూ సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈ నెలాఖర్లో తర్వాతి విచారణ ఉంది. అయితే సెప్టెంబర్ 16న గేమ్స్ క్రాఫ్ట్ తన సూపర్ యాప్ గేమ్‌జీని షట్‌డౌన్ చేసింది. రాబోయే రోజుల్లో బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌కు చెందిన ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు భారీ స్థాయిలో నోటీసులు రానున్నాయని తెలిసింది.