Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ ఆశించిన స్థాయిలో పతకాలు సాధిస్తూ దూసుకుపోతోంది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల తొమ్మిదో రోజున పతకాల సంఖ్యను పెంచుకుంది భారత్. మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో సుతీర్థ ముఖర్జీ, అయ్హికా ముఖర్జీ సెమీఫైనల్ ఆడనున్నారు. తొమ్మిదో రోజు ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, రాహుల్, రాజేంద్ర భారత్ ఖాతాలో మరో పతాకాన్ని చేర్చారు. 


రోలర్ స్కేటింగ్ లో పురుషుల జట్టు 3000 మీటర్ల రిలే రేసులో భారత్ కాంస్యం గెలుచుకుంది. రోలర్ స్కేటింగ్ ఫైనల్ లో సంజన, కార్తీక, హీరాల్, ఆరతి మూడో స్థానంలో నిలిచారు. రోలర్ స్కేటింగ్ మహిళల విభాగంలో కూడా భారత అమ్మాయిలు సత్తా చాటారు. 3000 మీటర్ల రిలే రేసులో కాంస్యం గెలుచుకున్నారు. 


ఆర్చరీ విభాగంలో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ 1/8 ఎలిమినేషన్ లో మలేషియాను ఓడించి భారత్ క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది. అక్టోబర్ 4వ తేదీన జరిగే క్వార్టర్స్ లో భారత్ ఇండోనేషియాతో తలపడనుంది. 


ఒక్కరోజే 15 పతకాలు సాధించిన భారత్


ఆదివారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ విజృంభించింది. ఒక్క రోజే 15 పతకాలు సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు భారీ రికార్డు సృష్టించారు. 2010లో ఒక్కరోజే 10 పతకాలు గెలవగా.. ఈ ఏడాది ఏకంగా 15 పతకాలు గెలుచుకుంది. ఆసియా క్రీడలు 2014లో భారత్ 10 పతకాలు సాధించింది. జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో 10 పతకాలు సాధించింది. ఇవాళ పాత రికార్డును భారత్ చెరిపేసింది. ఇక.. ఆసియా క్రీడలు 2023లో భారత్ ఇప్పటి వరకు 13 బంగారు పతకాలు సాధించింది. అందులో భారత ఆటగాళ్లు 19 రజత పతకాలను కైవసం చేసుకున్నారు. 19 కాంస్య పతకాలు సాధించారు. ఇప్పటి వరకు భారత్ 53 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.


100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!


తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. కానీ ఈ పతకం గెలిచే క్రమంలో ఎంతో డ్రామా నటించింది. చైనాకు చెందిన యు వాన్ని రేసును ముందుగానే ప్రారంభించింది. తన వెంటనే జ్యోతి రేసును మొదలుపెట్టింది.


అధికారులు మొదట ఇద్దరూ ఫాల్స్ స్టార్ట్ చేశారని ప్రకటించారు. కానీ ఎంతోసేపు డిస్కషన్ తర్వాత జ్యోతి సరిగ్గానే ప్రారంభించిందని నిర్ణయించారు. రేసు ముగిశాక కూడా రివ్యూ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఫలితాలు ఆలస్యంగా వెలువడ్డాయి. జ్యోతి యర్రాజి రజతం సాధించిందని ప్రకటించారు. చైనా అథ్లెట్ యు వాన్ని రేసు నుంచి డిస్‌క్వాలిఫై అయింది.


మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతినే బంగారు పతకానికి బలమైన కంటెండర్‌గా నిలిచింది. కానీ జపాన్‌కు చెందిన మకో ఫుకుబే స్వర్ణాన్ని గెలుచుకుంది. 12.78 సెకన్లలో జ్యోతి రేసును పూర్తి చేసింది. ఇది ఆమెకు సెకండ్ బెస్ట్.


అయితే తన ప్రదర్శనతో సంతృప్తి చెందలేదని జ్యోతి గతంలో కూడా ఒకసారి తెలిపింది. ‘ఇది నా బెస్ట్ అని కచ్చితంగా చెప్పలేను. గతంలో సాధించిన ఘనతలకు పొంగిపోయే దాన్ని కాదు నేను. నా రికార్డులను నేనే మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నాను.’  అని జ్యోతి తెలిపారు.