ఆసియాకప్ హాకీ 2022 టోర్నమెంట్‌లో టీమిండియా సూపర్-4కు చేరుకుంది. ఇండోనేషియాతో మ్యాచ్‌లో కచ్చితంగా 16 గోల్స్ చేయాల్సిన దశలో బరిలోకి దిగిన భారత్ 16-0తో విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ ఇంటి బాట పట్టగా... టీమిండియా సూపర్-4లోకి అడుగుపెట్టింది. చివరి క్వార్టర్‌లో ఏకంగా ఏడు గోల్స్‌ను టీమిండియా సాధించడం విశేషం.


భారత ఆటగాళ్లలో డిప్సన్ టిర్కే ఐదు గోల్స్, పవర్ రాజ్‌భర్ మూడు గోల్స్‌తో చెలరేగారు. కార్తీక్ సెల్వం, అభరన్ సుదేవ్, ఎస్వీ సునీల్ రెండేసి గోల్స్ సాధించగా...  నీలం సందీప్, ఉత్తం సింగ్ చెరో గోల్ కొట్టారు. ఇండోనేషియా అస్సలు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. అక్కడక్కడా ప్రయత్నించినా బలమైన భారత్ డిఫెన్స్ ముందు నిలబడలేకపోయారు.


భారత్ మొదటి క్వార్టర్ ముగిసేసరికి 3-0, రెండో క్వార్టర్ ముగిసేసరికి 6-0, మూడో క్వార్టర్ ముగిసేసరికి 10-0 ఆధిక్యంతో నిలిచింది. చివరి క్వార్టర్‌లో ఏకంగా ఆరు గోల్స్ సాధించి మ్యాచ్‌ను గెలుచుకోవడంతో పాటు సూపర్-4లోకి కూడా అడుగుపెట్టింది.


ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో భారత్ 1-1తో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఆ తర్వాత జపాన్ చేతితో 2-5తో ఓడింది. పాకిస్తాన్ కూడా జపాన్ చేతిలో 2-3తో ఓడటంతో... ఇండోనేషియాతో మ్యాచ్‌ను 15 గోల్స్ తేడాతో గెలిస్తే సూపర్-4లో అడుగు పెట్టే ఈక్వేషన్‌లోకి టీమిండియా ఎంటర్ అయింది. ఇండోనేషియాను 16-0తో ఓడించి సూపర్-4లోకి అడుగుపెట్టింది.