Chintamaneni Private Case : టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) ఏపీ ప్రభుత్వంపై ప్రైవేట్ పిటిషన్ వేశారు. ఏలూరు కోర్టు(Eluru Court)లో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ ప్రైవేట్ పిటిషన్(Private Petition) దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్(Goutam Sawang) లపై ప్రైవేట్ కేసు పెట్టారు. వీరితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు రాహుల్ దేవ్ శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్ పేర్లను కూడా ప్రైవేట్ కేసులో పేర్కొన్నారు. వీరితో పాటు నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలపై కేసు పెట్టారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలు, తెలుగుదేశం పార్టీ(TDP) కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో తనపై 25 పైగా కేసులు నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్ పిటిషన్ లో వెల్లడించారు. 



  • ఇటీవల ఎస్సీ, ఎస్టీ కేసు


ప్రజల సమస్యలు, ప్రభుత్వ తప్పిదాలపై టీడీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటుంటే కేసులు(Police Cases) పెట్టి వేధిస్తున్నారని చింతమనేని తన పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(SC ST Atrocity case) కేసు న‌మోదైంది. రాష్ట్రంలో పెరిగిన క‌రెంట్ ఛార్జీల‌ను నిర‌సిస్తూ ఇటీవల టీడీపీ నిర‌స‌న కార్యక్రమాలు చేపట్టింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం ప‌రిధిలోని వెంకంపాలెంలో జరిగిన నిరసనలో చింత‌మ‌నేని పాల్గొన్నారు. అయితే ఈ నిరసనను అడ్డుకోడానికి వైసీపీకి చెందిన స‌ర్పంచ్ టి.భూపతి, ఉప సర్పంచ్‌ ఎస్‌.రమేష్ రెడ్డితో పాటు మ‌రికొంత మంది ప్రయత్నించారు. ఈ సమయంలో చింతమనేని తమను కులం పేరుతో దూషించారని స‌ర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.   



  • తాహశీల్దార్ పై దాడి


అయితే ఇప్పటికే చింతమనేనిపై 60కి పైగా కేసులు ఉన్నాయి. దీంతో పాటు రౌడీషీట్‌(Rowdy Sheet) కూడా ఓపెన్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనిపై పలు పోలీస్ కేసులు  నమోదు అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై వరుసగా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో పలు కేసుల్లో ఆయన అరెస్ట్ కూడా చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో వివాదాస్పద నేతగా చింతమనేని ప్రభాకర్ పేరు తరచూ వార్తల్లో నిలిచేది. మహిళా తాహశీల్దార్(Tahsilder) వనజాక్షిపై దాడికి పాల్పడటం గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. అప్పటిలో ఈ ఘటనపై అసెంబ్లీలో తీవ్రంగా చర్చ జరిగింది.  దెందులూరు, పెదవేగి, పెదపాడు పోలీస్ స్టేషన్లలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ ఆయనపై 60కి పైగా కేసులు నమోదు అయ్యాయి.