Madhuyashki Goud : 'రెడ్ల కిందనే పనిచేయాలి' రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మధుయాష్కీ గౌడ్ ఫైర్, బహిరంగలేఖలో సంచలన వ్యాఖ్యలు

ABP Desam Updated at: 26 May 2022 02:33 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Madhuyashki Goud Letter : 'మా రెడ్లకిందనే పనిచేయాలి. రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది' అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి.

రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ

NEXT PREV

Madhuyashki Goud Letter To Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ బహిరంగలేఖ రాశారు. కాంగ్రెస్(Congress) పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి(Reddy), కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక అన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు దేశ స్వాతంత్ర పోరాటంలోనూ, అనంతర దేశ నిర్మాణంలోనూ చారిత్రక పాత్ర పోషిస్తూ అగ్రకులాలకు, బహుజనులకు, ఏఐసీసీ(AICC) అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శి, పీసీసీ అధ్యక్ష, కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. 


రెడ్డి కాంగ్రెస్ ఏమైందో తెలుసు


పార్టీ తరఫున అన్ని పదవులు పొంది రెడ్డి కాంగ్రెస్(Reddy Congress) ఏర్పాటు చేసి అధినాయకత్వాన్ని బలహీన పర్చాలని చూసినా,  వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా ఎంతోమందిని నాయకులను ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య పదవులిచ్చిందన్నారు. సోనియాగాంధీకి 1991లోనే ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినా తాను తప్పుకుని పీవీ నరసింహారావును ప్రధాని చేశారని మధుయాష్కీ గుర్తించేశారు. మూడుసార్లు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఏకైక నాయకురాలు సోనియా గాంధీ మాత్రమే అన్నారు.  సోనియా గాంధీ(Sonia Gandhi) నాయకత్వం, త్యాగం, దూరద్రుష్టితో ప్రతిపక్ష పార్టీలను సమీకరించి 2004లో యూపీఏ-1(UPA-I) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేశారని గుర్తుచేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చి పీసీసీ అధ్యక్షుడైనా, తాను ప్రచార కమిటీ ఛైర్మన్ అయినా అది ఎవరి గొప్పతనం కాదని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi) చలువే అన్నారు.  


రెడ్డి-బీసీ కలయికతో ప్రభుత్వం


యూపీఏ-1 లో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం, రైతు రుణమాఫీ, సమాచార హక్కుచట్టం, ఐటీ, టెలికామ్ రెవెల్యూషన్, సివిల్ న్యూక్లియర్ డీల్, ఇతర సంక్షేమ పథకాల అమలు వల్ల సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ నాయకత్వంలో యూపీఏ- 2 ఏర్పడిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS RajaShekar Reddy) సీఎల్పీ నాయకుడిగా,  బీసీ బిడ్డ డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా, రెడ్డి-బీసీ కలయికతో సోనియాగాంధీ నాయకత్వంలో 2004-2009లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మధుయాష్కీ గుర్తుచేశారు.  వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకు గాను 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలానే యూపీఏ ఏర్పడిందని, ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదు అనడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కించపర్చడం అవమానించడమే అన్నారు. అప్పుడు పార్టీలో లేకపోవడం వల్ల ఈ విషయాలను రేవంత్ కు తెలియజేస్తున్నానన్నారు.


కేసీఆర్ మోసం


డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాలు, దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మాటలు చెప్పిన కేసీఆర్(KCR) మాటలు నమ్మి ఆయనకు రెండుసార్లు ప్రజలు ఓట్లేశారని మధుయాష్కీ గౌడ్ అన్నారు.అ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఈ వర్గాలను మొత్తంగా మోసం చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోకన్నా ప్రత్యేక తెలంగాణలోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరింత ఎక్కవగా అణిచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. దళితబంధుతో దగా, రైతుబంధుతో మోసం చేస్తున్నారన్నారు. 




ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణ రాబందుల సమితి పార్టీ చేతిలో ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతింది. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ సభతో ఉత్తేజితులై, ఊసరవెల్లి కేసీఆర్ మోసాలను గ్రహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మీరంతా ‘‘మా రెడ్లకిందనే పనిచేయాలి.. రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది’’ అంటూ చేసి వ్యాఖ్యలు అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి. మీ వ్యాఖ్యలపై  ఈ వర్గాల్లో అలజడి మొదలైంది..  అట్టుడికిపోతున్నాయి. - -మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత


ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నా


బహుజన వర్గాలన్నీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని మధుయాష్కీ అన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా ఉందన్నారు. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. 

Published at: 26 May 2022 02:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.