IND vs AFG, Asia Cup 2022 Super 4 Match: ఆసియాకప్‌ -2022 ఆఖరి పోరులో టీమ్‌ఇండియా విధ్వంసకరంగా ఆడుతోంది. అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల భారీ టార్గెట్‌ నిర్దేశించింది. అభిమానుల కోరికను మన్నిస్తూ.. క్రికెట్‌ పిచ్‌పై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (122*; 61 బంతుల్లో 12x4, 6x6) తిరిగి తన పీక్‌ ఫామ్‌కు వచ్చేశాడు. మూడేళ్లకు పైగా ఎదురు చూస్తున్న 71వ అంతర్జాతీయ శతకం బాదేశాడు. అతడికి తోడుగా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (62; 41 బంతుల్లో 6x4, 2x6) దంచికొట్టాడు. రిషభ్ పంత్‌ (20*; 16 బంతుల్లో 3x4) అజేయంగా నిలిచాడు.


వచ్చాడయో సామీ!


టాస్‌ ఓడిన టీమ్‌ఇండియాకు తిరుగులేని ఆరంభం లభించింది. రోహిత్‌ శర్మకు విరామం ఇవ్వడంతో కేఎల్‌ రాహుల్‌తో కలిసి కింగ్‌ కోహ్లీ ఓపెనింగ్‌కు దిగాడు. ఆడిన మొదటి బంతి నుంచే మంచి ఈజ్‌తో సందడి చేశాడు. తొలి 3 ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు ఆ తర్వాత దూకుడు పెంచారు. వరుస బౌండరీలు బాదేస్తూ 52 పరుగులతో పవర్‌ ప్లే ముగించారు. ఆ తర్వాత ఓపెనర్లు మరింత చెలరేగారు. విరాట్‌ 32 బంతుల్లో, రాహుల్‌ 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు చేయడంతో టీమ్‌ఇండియా 11.2 ఓవర్లకు 100 రన్స్‌ చేసింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 119 వద్ద ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు కొట్టబోయి రాహుల్‌ ఔటయ్యాడు. మరో 6 పరుగుల వ్యవధిలోనే సూర్య కుమార్‌ (6) ఔటయ్యాడు. విరాట్‌ మాత్రం ఎక్కడా ఆగలేదు. 16 ఓవర్ల తర్వాత తన మునుపటి ఫామ్‌ను చూపించాడు. భారీ షాట్లు ఆడుతూ 53 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అభిమానులను మురిపించాడు. అజేయంగా నిలిచాడు. దాంతో భారత్‌ 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 212 చేసింది.