Hyderabad Traffic Diversion : హైదరాబాద్ లో రేపు(సెప్టెంబర్ 9) గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలోని ప్రధాన చెరువుల వద్ద ఇప్పటికే నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేసింది. నిమజ్జన శోభాయాత్రకు పోలీసులు రూట్ మాప్ సిద్ధం చేశారు. నిమజ్జనానికి తరలవచ్చే విగ్రహాలను ఈ మార్గాల్లో తీసుకురావాలని సూచించారు. ఇందులో భాగంగా రేపు(శుక్రవారం) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుందని  భావిస్తున్నామన్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌ మళ్లింపు ప్రకటన విడుదలచేశామన్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.  




హుస్సేన్ సాగర్ వద్ద 


హుస్సేన్‌ సాగర్‌లో రేపు దాదాపు 15 వేలు నుంచి 20 వేల విగ్రహాలు నిమజ్జనం చేస్తారని అంచనా వేస్తున్నట్టు రంగనాథ్‌ తెలిపారు. విధుల్లో మూడు వేల మంది ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారన్నారు. డ్రోన్‌, సీసీటీవీ కెమెరాలు, మౌంటెడ్‌ వాహనాల పర్యవేక్షణలో నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షిస్తామన్నారు. ట్రాఫిక్ మళ్లించి ఇతర వాహనాల కోసం ప్రత్యామ్నాయ రూట్‌లను సూచించామన్నారు. గణేశ్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.   ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల మధ్య ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1 గంట కల్లా ఎన్టీఆర్‌మార్గ్‌ వైపు నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌ తెలిపారు.  


ఐడీఎల్ చెరువు వద్ద 


కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు వద్దకు వీక్షకుల వాహనాలు అనుమతించరు. కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను జేఎన్టీయూ, ఫోరమ్ మాల్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. హైటెక్ సిటీ, మాదాపూర్ నుంచి కైతలాపూర్ మీదుగా కూకట్‌పల్లి వై జంక్షన్‌కు వెళ్లే వాహనాలను రెయిన్‌బో విస్టా - మూసాపేట్ రోడ్డులో కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ వైపు మళ్లించారు. 


సూరారం కట్టమైనమ్మ ట్యాంక్ వద్ద 


అల్వాల్‌లోని హస్మత్‌పేట్ ట్యాంక్ దగ్గర గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న కారణంగా సందర్శకుల వాహ‌నాలను అనుమతించరు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి, ఇతర కాలనీల నుంచి గణేశ్ విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలు అంజయ్యనగర్ మీదుగా హస్మత్‌పేట ట్యాంక్‌లోకి ప్రవేశించి విగ్రహాల నిమజ్జనం తర్వాత పాత బోయిన్‌పల్లి, మసీదు రోడ్డు, హరిజన బస్తీ వైపు వెళ్లాల్సి ఉంటుంది.  సూరారం కట్టమైసమ్మ ట్యాంక్ దగ్గర గణేశ్ నిమజ్జన ఊరేగింపు కోసం ట్రాఫిక్ మళ్లించారు.  బాలానగర్‌, జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్, బౌరంపేట, గండిమైసమ్మ సమీపంలోని సూరారం గ్రామం వద్ద మళ్లించారు. గండిమైసమ్మ, బాచుపల్లి నుంచి జీడిమెట్ల, బాలానగర్‌ వైపు వెళ్లే వాహనాలు బహదూర్‌పల్లి జంక్షన్‌ వద్ద ఎడమవైపు దూలపల్లి గ్రామం టీ జంక్షన్‌ - జీడిమెట్ల మీదుగా మళ్లించారు.






మెట్రో ప్రత్యేక సర్వీసులు 


గణేశ్‌ నిమజ్జనం కారణంగా హైదరాబాద్‌ మెట్రో స్పెషల్ సర్వీసులు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నామని తెలిపింది. చివరి మెట్రో రైలు సెప్టెంబర్‌ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు 2 గంటల సమయంలో గమ్య స్టేషన్లకు చేరుకోనుంది. తిరిగి ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు యథావిధిగా ప్రారంభం అవుతాయని మెట్రో ఎండీ తెలిపారు. 
 


ఆ మూడు జిల్లాల్లో హాలీ డే 


గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవుగా ప్రకటించింది. హైదరాబాద్ & సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవుగా ప్రకటించింది. రేపటి సెలవుకు బదులుగా నవంబరు 12న వర్కింగ్ డే అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది.