Amitabh Chaudhry Passes Away: బీసీసీఐ మాజీ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి (62) మరణించారు. రాంఛీలో మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆయన కన్ను మూశారని తెలిసింది. ఝార్ఖండ్‌ క్రికెట్‌ పాలకుడిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. భారత క్రికెట్‌ను మలుపు తిప్పిన ఎన్నో సంఘటనల్లో కీలకంగా వ్యవహరించారు. అమితాబ్‌ లేరన్న విషయం తెలియడంతో బోర్డు, క్రికెట్‌ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.


సుప్రీం కోర్టు బీసీసీఐ పాలక మండలిని నియమించినప్పుడు అమితాబ్‌ చౌదరీ బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా పనిచేశారు. 2004లో తొలిసారి క్రికెట్‌ పాలనలో అడుగుపెట్టారు. దశాబ్దకాలానికి పైగా ఝార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం (JSCA) అధ్యక్షుడుగా సేవలందించారు. టీమ్‌ఇండియా 2005లో జింబాబ్వేలో పర్యటించినప్పుడు ఆయన జట్టు మేనేజర్‌గా ఉన్నారు. కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ వివాదానికి ఆయన ప్రత్యక్ష సాక్షి.






కాలం గడిచే కొద్దీ అమితాబ్‌ చౌదరీ భారత క్రికెట్‌ పాలక వర్గంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తూర్పు జోన్‌ ప్రతినిధిగా బీసీసీఐ ఏర్పాటు చేసిన ఎన్నో కమిటీల్లో కీలకంగా ఉన్నారు. ఆయన ఝార్ఖండ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాంఛీలో ప్రపంచ స్థాయి స్టేడియం నిర్మించారు. 2013లో తొలిసారి ఇక్కడ భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి అంతర్జాతీయ వన్డే జరిగింది. అనురాగ్‌ ఠాకూర్‌ బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2013-1015 మధ్య అమితాబ్‌ కార్యదర్శిగా పనిచేశారు.


2017 జూన్‌లో కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మధ్య వివాదం పరిష్కరించేందుకు అమితాబ్‌ చౌదరీ ఎంతగానో ప్రయత్నించారు. ఆయన పాలనలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్‌ ఇదే కావడం గమనార్హం. క్రికెట్‌ పాలకుడిగానే కాకుండా ఐపీఎస్‌ అధికారిగానూ ఆయన సేవలందించారు. రెండేళ్ల క్రితం వరకు ఝార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.


అమితాబ్‌ చౌదరి మరణించారని తెలియడంతో బీసీసీఐ, క్రికెటర్‌ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. 'బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఝార్ఖండ్‌ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు అమితాబ్‌ చౌదరి హఠాన్మరణం షాక్‌కు గురిచేసింది. సమర్థుడైన పాలకుడిగా ఆయన ఆటపై తనదైన ముద్ర వేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి' అని మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.