All England Open 2022 Lakshya Sen Finishes Runner-Up: ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్‌కు మరో ప్రతిష్టాత్మక టోర్నీలో తుది మెట్టుపై నిరాశే ఎదురైంది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ 2022 పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్సెన్ 10-21, 15-21 తేడాతో లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు. తద్వారా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ రెండవ టైటిల్‌ను అక్సెల్సెన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
21 ఏళ్ల తరువాత ఈ టోర్నీలో ఫైనల్ చేరిన భారత పురుష షట్లర్ ఆదివారం జరిగిన ఫైనల్లో విజయం సాధిస్తే ప్రతిష్టాత్మక ఫైనల్‌ను గెలుచుకున్న మూడవ భారతీయ షట్లర్‌గా అవతరించేవాడు. ఒలింపిక్ విజేతతో తలపడటం, అందులోనూ మెగా టోర్నీ కావడంతో కాస్త ఒత్తిడికి లోనైన 20 ఏళ్ల లక్ష్య సేన్ తొలి గేమ్‌ను తక్కువ సమయంలోనే కోల్పోయాడు. అయితే రెండో గేమ్‌లో పోరాడినా అంతగా సరిపోలేదు. మ్యాచ్ ప్రారంభం నుంచి డెన్మార్క్ స్టార్ అక్సెల్సెన్ టాప్ గేర్‌లో ఆడుతూ లక్ష్య సేన్‌ను ఒత్తిడికి లోనయ్యేలా చేయడంలో సక్సెస్ కావడంతో సులువుగా పాయింట్లు సాధించాడు. సేన్ ఫైనల్‌ను బ్యాక్‌ఫుట్‌లో ప్రారంభించాడు. వరల్డ్ నెంబర్ వన్ ఏ దశలోనూ భారత షట్లర్‌కు గేమ్ నెగ్గే ఛాన్స్ ఇవ్వలేదు.
తొలి సెట్ కేవలం 22 నిమిషాలు..
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ నెగ్గాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన లక్ష్య సేన్ అంతగా అనుభవం లేకపోవడంతో ఒలింపిక్ ఛాంపియన్‌పై పైచేయి సాధించలేకపోయాడు. భారత స్టార్ షట్లర్‌పై డెన్మార్క్ ప్లేయర్ అక్సెల్సెన్ ఆధిపత్యం చెలాయించి 22 నిమిషాల్లో 21-10తో మొదటి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్య సేన్ కొన్ని సూపర్ స్మాష్‌లతో పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. 2వ గేమ్‌ను 21-15తో గెలిచిన అక్సెల్సెన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టైటిల్ రెండోసారి కైవసం చేసుకున్నాడు.
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో భారత్ రికార్డులు..
ఓవరాల్‌గా ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన ఐదవ భారత షట్లర్ లక్ష్య సేన్, కాగా 21 ఏళ్ల తరువాత ఫైనల్ చేరిన తొలి పురుష షట్లర్ కూడా అతడే. చివరగా 2001లో పుల్లెల గోపిచంద్ ఫైనల్ చేరి విజేతగా నిలిచారు. గతంలో ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపిచంద్ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ అందుకున్నారు. పురుష షట్లర్లలో భారత్ నుంచి ప్రకాష్ నాథ్ (1947), ప్రకాష్ పదుకొనే (1980, 1981), పుల్లెల గోపిచంద్ (2001)లో ఫైనల్ చేరారు. ప్రకాశ్‌నాథ్ రన్నరప్‌తో సరిపెట్టుకోగా. 1980లో ప్రకాష్ పదుకొనే విజేతగా నిలవగా, 1981లో రన్నరప్ గా ఉన్నారు. గోపిచంద్ 2001లో టైటిల్ నెగ్గారు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ 2015లో రన్నరప్‌గా నిలవగా.. తాజాగా ఫైనల్లో ఓటమితో రన్నరప్‌గా నిలిచాడు లక్ష్య సేన్.
Also Read: Lakshya Sen All England 2022: డిఫెండింగ్ చాంపియన్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్
Also Read: Watch Video: మ్యాచ్ మధ్యలో కూలిన గ్యాలరీ- 200 మందికి గాయాలు, వీడియో చూశారా?