Lakshya Sen defeated Lee Zii Jia in the semi-final All England Open 2022: భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్య సేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ పైనల్లోకి దూసుకెళ్లాడు. 20 ఏళ్ల భారత షట్లర్ గత కొంతకాలం నుంచి మెరుగైన ప్రదర్శనతో ఔరా అనిపిస్తున్నాడు. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ కైవసం చేసుకోవడానికి మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)పై లక్ష్య సేన్ విజయం సాధించి కీలకమైన చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ ఐదవ భారత షట్లర్‌గా లక్ష్య సేన్ నిలిచాడు. భారత్ నుంచి 21 ఏళ్ల తరువాత ఫైనల్ చేరిన తొలి పురుష క్రీడాకారుడు లక్ష్య సేన్.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 12–21, 21–19 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియాపై విజయ సాధించాడు. తొలి సెట్‌ను చాలా తొందరగానే ఏ ఇబ్బంది లేకుండా గెలిచిన లక్ష్య సేన్ రెండో సెట్‌లో తడబాటుకు లోనయ్యాడు. అయినా సరే మూడో సెట్‌లో పట్టు వదల్లేదు. ఓ దశలో వెనుకంజలో ఉన్నా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నెగ్గాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు గేర్ మార్చి ఆడాడు.
మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే మూడో గేమ్‌లో ప్రత్యర్ధి లీ జి జియా 14-10, 16-12, 18-16తో లక్ష్య సేన్‌పై ఆధిక్యంలోకి వెళ్లాడు. అక్కడ అసలు గేమ్ మొదలుపెట్టిన భారత స్టార్ షట్లర్ వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకుని 20-18 తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆపై పుంజుకున్న మలేషియా ప్లేయర్ లీ జి జియా ఒక్క పాయింట్ నెగ్గాడు. లక్ష్య సేన్ మరుసటి పాయింట్ నెగ్గి ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాడు.
21 ఏళ్ల తరువాత..
ఓవరాల్‌గా ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ చేరిన ఐదవ భారత షట్లర్ లక్ష్య సేన్, కాగా 21 ఏళ్ల తరువాత ఫైనల్ ఆడనున్న భారత తొలి పురుష షట్లర్‌గా నిలిచాడు. చివరగా 2001లో పుల్లెల గోపిచంద్ ఫైనల్ చేరారు. గతంలో ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపిచంద్ ఫైనల్ చేరడంతో పాటు విజయం సాధించారు. పురుష షట్లర్లలో భారత్ నుంచి ప్రకాష్ నాథ్ (1947), ప్రకాష్ పదుకొనే (1980, 1981`), పుల్లెల గోపిచంద్ (2001)లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌నాథ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. 1980లో ప్రకాష్ పదుకొనే విజేతగా నిలవగా, 1981లో రన్నరప్ గా ఉన్నారు. గోపిచంద్ 2001లో టైటిల్ నెగ్గారు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ 2015లో ఫైనల్ చేరినా, రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.