ఎప్పుడూ ఎంతో సైలెంట్‌గా కనిపించే భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ నాగిని డ్యాన్స్ వేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. నాగిని డ్యాన్స్ అంటే మనకు గుర్తుకు వచ్చేది బంగ్లాదేశ్ ఆటగాళ్లు కదా. ఇక నుంచి మనకి నాగిని డ్యాన్స్ అంటే కైఫ్ కూడా గుర్తొస్తాడు.
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులే కాదు కెప్టెన్ కోహ్లీ ఈ సారి విజయంతో సరికొత్తగా సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
భారత్ X ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ కోసం ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, కైఫ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య టెస్టు మధ్యలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఓవల్ టెస్టులో భారత్ గెలిస్తే తాను నాగిని డ్యాన్స్ వేస్తానని కైఫ్ గతంలో తనకు చెప్పినట్లు సెహ్వాగ్ గుర్తు చేశాడు. అంతే ఇంకేముంది ఓవల్ టెస్టులో టీమిండియా విజయం సాధించగానే సామాజిక మాధ్యమాల్లో అభిమానులు కైఫ్ నాగిని డ్యాన్స్‌కి టైమైంది. ఇంకెందుకు ఆలస్యం అంటూ కామెంట్లు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కైఫ్ లైవ్‌లోనే నాగిని డ్యాన్స్ చేశాడు. దీంతో కైఫ్ నాగిని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్ రూమ్‌ను హోరెత్తించగా.. భారత అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు.