Sports News in Telugu:  ఒలింపిక్స్‌లో హాకీ (Hockey) జట్టు జైత్రయాత్రతో భారత్‌ ఎనిమిది బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ప్రభతోపాటు మిగిలిన ఆటల ప్రాభవం కూడా తగ్గుతూ వచ్చింది. మరో బంగారు పతకాన్ని కళ్ల చూసేందుకు భారత జట్టుకు అక్షరాల 28 సంవత్సరాలు పట్టింది. ఒకప్పుడు హాకీలో రెండుసార్లు హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి మురిసిపోయిన భారత్... మరో స్వర్ణాన్ని ముద్దాడేందుకు దాదాపు రెండున్నర దశాబ్దాలు ఎదురుచూసింది. స్వర్ణ పతక కరువు తీరుస్తూ 2008 ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా(abhinav bindra) పసిడి పతకాన్ని ముద్దాడాడు. అంతకుముందు 2004 ఏథెన్స్‌ విశ్వ క్రీడల్లోనూ రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్‌(Rajyavardhan Singh Rathore) రజత పతకాన్ని గెలిచి త్రివర్ణ పతాక కీర్తిని విశ్వ వ్యాప్తం చేశాడు. హాకీ తర్వాత భారత్‌ను మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలిపిన ఇతర విభాగాలు రెజ్లింగ్, షూటింగ్. 


చరిత్రకు అంకురార్పణ చేస్తూ..

ఒలింపిక్స్‌లో భారత ప్రయాణం అంతా ఆశాజనకంగా ఉండదు. హాకీలో భారత్‌ సత్తా చాటుతున్నా వ్యక్తిగత విభాగంలో చాలా ఏళ్ల వరకు పతకం మాత్రం రాలేదు. అందులోనూ స్వర్ణ పతకం అని ఆలోచించేందుకు కూడా భారత అథ్లెట్లు సాహసించలేని పరిస్థితి ఉండేది. 1928లో ఒలింపిక్స్‌లో ప్రారంభమైన భారత ప్రస్థానం... ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ మనకు వచ్చిన మొత్తం పతకాల సంఖ్య మాత్రం కేవలం 35 మాత్రమే. హాకీలో వచ్చిన స్వర్ణ పతకం తర్వాత భారత్‌ మరో పసిడిని ముద్దాడేందుకు చాలా ఏళ్లు నిరీక్షించింది.

2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్.. షూటింగ్‌లో తొలి రజత పతకం సాధించి నవ శకానికి నాంది పలికాడు. పురుషుల డబుల్ ట్రాప్‌ విభాగంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్  రజతాన్ని ముద్దాడి.. స్వాతంత్ర్యం తర్వాత వ్యక్తిగత రజత పతకాన్ని గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు.  చైనాకు చెందిన వాంగ్ జెంగ్‌ నుంచి ఎదురైన సవాల్‌ను అధిగమించి రాజ్యవర్దన్‌ రజతాన్ని సాధించి చరిత్ర పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు. ఈ పతకంతో దేశంలో షూటింగ్‌పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. 

 

చరిత్ర తిరగరాసిన అభినవ్ బింద్రా..

 రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ నవ శకాన్ని ఆరంభించగా అభినవ్ బింద్రా దానిని మరింత ముందుకు తీసుకెళ్లాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో పసిడిని గెలిచిన బింద్రా... భారత్‌కు వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించాడు. ఫైనల్‌లో అభినవ్ బింద్రా 10.8 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బింద్రా సాధించిన స్వర్ణం... ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతకం. ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్‌ కుమార్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో భారత్‌కు మరో రజత పతకం అందించాడు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఏథెన్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌కు షూటింగ్‌లో రెండో రజతం వచ్చింది. 

 

ఆ తర్వాత గగన్ నారంగ్(Gagan Narang) 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో కాంస్య పతకం సాధించి షూటింగ్‌పై అంచనాలను మరింత పెంచాడు. హాకీ తర్వాత వచ్చిన ఈ పతకాలే భారత్‌ను విశ్వ క్రీడల్లో పతకం సాధించగలమన్న నమ్మకాన్ని అథ్లెట్లకు ఇచ్చాయి. ఇప్పటివరకూ భారత్‌కు వ్యక్తిగత విభాగంలో వచ్చిన స్వర్ణాలు రెండు. అందులో ఒకటి సాధించింది అభినవ్‌ బింద్రా అయితే... రెండోది నీరజ్‌ చోప్రాది.

 

ఈసారి భారీ అంచనాలు

పారిస్ 2024 ఒలింపిక్స్‌లోనూ భారత షూటింగ్‌ బృందంపై భారీ అంచనాలు పెరిగాయి. మొత్తం 15 మంది సభ్యులు ఈసారి పతక ఆశలు రేపుతున్నారు. మను భాకర్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అంజుమ్ మౌద్గిల్, ఎలవెనిల్ వలరివన్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఈషా సింగ్, రిథమ్ సాంగ్వాన్, రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాంష్ సింగ్ పన్వార్, ఆషి చౌక్సే, సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమాలపై ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి గురి తప్పకుండా భారత్‌కు పతకం తేవాలని ఆశిద్దాం. భారత షూటర్లకు ఆల్ ది బెస్ట్.