AP Minister Satyakumar inspects Ruia Hospital | తిరుపతి: ఏపీలో వైద్యశాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి, తప్పు చేసిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఓపీ విభాగంతో పాటు ఇన్ పేషెంట్ విభాగం పరిశీలించారు. పేషెంట్లను కలిసి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు మంత్రి సత్యకుమార్. మెడిసిన్ ఎలా ఇస్తున్నారో సైతం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 


అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు 
రుయాలో తనిఖీ చేసిన అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య శాఖను మాజీ సీఎం జగన్ అనారోగ్య శాఖగా మార్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహకారాన్ని అందిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 


రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు పాతవే ఉన్నాయని, ఓపీ కోసం సైతం గంటల తరబడి పేషెంట్లు వేచి చూడాల్సి వస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. లేటెస్ట్ ఈక్విప్ మెంట్ లేకపోవడంతో పేషెంట్ల రిపోర్టులు ఆలస్యం కావడంతో, సర్జరీలలో జాప్యం జరుగుతోందన్నారు. మోడ్రన్ టెక్నాలజీ పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రులకు అందుబాటులోకి తెస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే క్షేత్రస్థాయిలో రుయా ఆసుపత్రిలో తనిఖీలు చేస్తే  వైసీపీ హయాంలో రుషికొండలో ఏం జరిగిందో బయటి ప్రపంచానికి తెలియలేదు. ప్రభుత్వం మారాక ఇప్పుడు పరిశీలిస్తే.. లోపల నిర్మాణాల హంగూ, ఆర్భాటం చూసి అంతా ఆశ్చర్యపోయారని చెప్పారు. ప్రజాధనాన్ని సాధ్యమైనంత దుర్వినియోగం చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ సెటైర్లు వేశారు.


ఆ సమయంలో చాలా భయపడ్డాం: సిబ్బంది 
రుయా ఆసుపత్రి సిబ్బంది మంత్రి సత్యకుమార్ తో తమ సమస్యలు చెప్పుకున్నారు. కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయాలు, కిట్స్ అందుబాటులో లేవని మంత్రికి తెలిపారు. అయితే ఈ విషయం బయటకు చెబితే డాక్టర్ సుధాకర్ కి పట్టిన గతే తమకు పడుతుందని భయపడ్డామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం గెలవడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సకాలంలో మెడికల్ ఈక్విప్ మెంట్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ను కోరారు. పది, పదిహేనెళ్ల నుంచి పని చేస్తున్నామని, తమకు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరారు. వారి రిక్వెస్ట్ పై సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యకుమార్.. వివరాలు సేకరించి త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు.