India Bag Two Gold In Chess Olympiad 2024 | న్యూఢిల్లీ: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. చెస్ ఒలింపియాడ్ లో విజేతగా నిలిచిన భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. కాగా, చెస్ ఒలింపియాడ్ లో భారత్ కు దక్కిన తొలి స్వర్ణాలు కావడం విశేషం. భారత పురుషుల జట్టు చివరిదైన 11వ రౌండ్‌లో స్లోవేనియాతో తలపడింది. భారత స్టార్ ప్లేయర్లు అర్జున్ ఇరిగేశీ, డి.గుకేశ్ తమ ప్రత్యర్థి ఆటగాళ్లపై పైఎత్తులు వేసి వ్యక్తిగత మ్యాచ్‌లలో విజయం సాధించారు. జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ నెగ్గగా, వ్లాదిమిర్ ఫెదోసీవ్‌పై గుకేశ్ విజయం సాధించాడు. దాంతో చెస్ ఒలింపియాడ్ లో భారత్ తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇది 45వ చెస్ ఒలింపియాడ్ కాగా, ఈసారి ఎలాగైనా స్వర్ణంతో వస్తామని భారత పురుషులు, మహిళల జట్లు బంగారం తెస్తామని ధీమాగా ఉన్నారు. వరుస గేమ్ లలో నెగ్గుతూ అగ్రస్థానాన్ని కొనసాగించారు.
చెస్ ఒలింపియాడ్ విజేతలుగా నిలిచిన భారత చెస్ ప్లేయర్స్, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్లు పి హరికృష్ణ, గుకేశ్, అర్జున్ ఇరిగేశీ, విదిత్ గుజ్రాతీ, ప్రజ్ఞానందలకు అభినందనల వెల్లువ మొదలైంది. పురుషుల జట్టు 11వ రౌండ్ డ్రా చేసుకున్నా భారత్ టైటిల్ నెగ్గుతుంది. అయితే ఇరిగేశీ, గుకేశ్ తో పాటు ప్రజ్ఞానంద సైతం గెలవడంతో భారత్ కు తిరుగులేకుండా పోయింది. ఈ ఒలింపియాడ్ లో భారత్ తొలి 8 రౌండ్‌లలో వరుసగా గెలిచింది. కానీ తొమ్మిదో రౌండ్ డ్రా చేసుకున్నారు. 10వ రౌండ్‌లో పటిష్ట అమెరికాపై 2.5-1.5తో సత్తా చాటారు. ఆదివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్‌లో స్లొవేనియాపై నెగ్గడంతో పురుషుల టీమ్ భారత్‌కు తొలి స్వర్ణం అందించింది.
మహిళల టీమ్ సైతం తొలిసారి స్వర్ణం..
చెస్ ఒలింపియాడ్ లో భారత మహిళల టీమ్ సైతం సంచలనం నమోదు చేసింది. టోర్నీ చరిత్రలో తొలిసారి స్వర్ణం నెగ్గారు. భారత మహిళలు చివరిదైన 11వ రౌండ్‌లో 3.5-0.5 భారీ తేడాతో అజర్‌బైజాన్‌పై విజయం సాధించారు. దివ్య దేశ్‌ముఖ్, హారికలు ప్రత్యర్థుల్ని చిత్తు చేయగా.. ప్రజ్ఞానంద సోదరి వైశాలి డ్రా చేసుకుంది. మరో ప్లేయర్ వంతిక అగర్వాల్ నెగ్గడంతో భారత మహిళల జట్టు సైతం చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకూ 2 స్వర్ణాలు నెగ్గగా, అది కూడా ఇదే ఏడాది కావడం విశేషం. వీరి గెలుపు మరొకొందరు ఆటగాళ్లను చెస్ వైపు అడుగులు వేసేలా చేస్తుంది.
Also Read: IND vs BAN: ఆరు వికెట్లతో అదరగొట్టిన అశ్విన్, భారత్ ఘన విజయం