IND vs BAN: ఆరు వికెట్లతో అదరగొట్టిన అశ్విన్, భారత్ ఘన విజయం
India vs Bangladesh: చెన్నైలో జరిగిన మొదటి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 280 పరుగుల తేడాతో ఓడించింది. టెస్టు క్రికెట్‌లో ఓటముల కంటే ఎక్కువ విజయాలను భారత్ ఇప్పుడు నమోదు చేసింది.

India vs Bangladesh Highlights, 1st Test Day 4:
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను 4వ రోజు భారత్ 280 పరుగుల తేడాతో ఓడించింది. శనివారం 514 రన్స్ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాను భారత బౌలర్లు 234 రన్స్‌కే కట్టడి చేశారు. దీంతో 280 రన్స్ తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు క్రికెట్‌లో ఓటముల కంటే ఎక్కువ విజయాలను భారత్ ఇప్పుడు నమోదు చేసింది.
భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. జడేజా ముగ్గురిని పెవిలియన్ కు పంపించాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే బొక్కబోర్లా పడింది . రెండో ఇన్సింగ్స్ లో భారత జట్టు 287 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో 515 పరుగుల భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కానీ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి 234 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో మాత్రమే కాస్త రాణించాడు. భారత బౌలర్లలో అశ్విన్‌తో పాటు మూడు వికెట్లు తీసి జడేజా కూడా తనవంతు సాయం అందించాడు. . బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.
నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 62.1 ఓవర్లలోనే కుప్పకూలింది. ఓవైపు అశ్విన్.. మరోవైపు జడేజా రాఫాడించారు. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ బంతిని అందుకున్న క్షణం నుంచే వికెట్ల కోత మొదలు పెట్టేశాడు. అటు జడేజా కూడా తనవంతు సాయం అందించాడు. చివరి వికెట్లను అశ్విన్, జడ్డూ నువ్వా నేనా అన్నట్టు పడగొట్టారు. లంచ్ బ్రేక్ లోపే బంగ్లాకు ఫుల్ బ్రేక్ తీసుకోమంటూ ఆలౌట్ చేసేశారు.
మొత్తానికి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సత్తా చూపించిన లోకల్ భాయ్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.