Vontimitta Sri Kodanda Rama Swamy Temple: తెలంగాణ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయ్
శ్రీరాముడు నడయాడిన ఈ ప్రదేశాన్ని జాతీయ పర్యాటక, ఆధ్యాతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నియమించిన నిపుణుల బృందం ప్రతిపాదించింది. భక్తులను ఆకట్టుకునేలా చెరువు మధ్యలో ఎత్తయిన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నివేదించారు. రామయ్య క్షేత్రం దగ్గరున్న చెరువు మధ్యలో 600 అడుగులు ఎత్తుతో ఆకర్షణీయంగా రాములోరి విగ్రహాన్ని నిర్మించాలని ప్రణాళికలో ప్రతిపాదించారు. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఈమధ్యే TTD ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను సమర్పించారు. ఇప్పటికిప్పుడు అలంకరణలు కాదు..రానున్న మూడు దశాబ్ధాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిపుణులు కసరత్తు చేశారు. కడప-రేణిగుంట జాతీయ రహదారి, చెన్నై-ముంబయి రైల్ మార్గం మధ్యలో ఉంది ఈ చెరువు. ఇందులో కోదండరాముడి ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా భక్తులను ఆకర్షిస్తుందని అంచనా. తటాకం మధ్యలో కోదండరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని...ఏకంగా ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేయాలంటూ ప్రణాళికలు రూపొందించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో ఉంది. ఇది "ఏకశిలానగరి"గా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆలయ గర్భగుడిలో కొలువుతీరిన ప్రధాన విగ్రహాలైన (సీతారామలక్ష్మణులు) ఒకే శిలపై చెక్కి ఉంటాయి. ఆలయం ఒక మిట్ట (ఎత్తైన భూమి) మీద నిర్మించబడినందున "ఒంటిమిట్ట" (ఒక మిట్ట) అని పేరు వచ్చిందని చెబుతారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం.. శ్రీరాముడు...హనుమంతుడిని కలవడం కన్నా ముందే ఇక్కడకు వచ్చారని.. సీతారాములను, లక్ష్మణుడిని దర్శించుకున్న జాంబవంతుడు వారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించాడని చెబుతారు. ఇక్కడే ఉన్న కొండపై ఆశ్రమం నిర్మించి రాముడి తారకమంత్రాన్ని పఠిస్తూ జపం చేసే జాంబవంతుడు స్వయంగా విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేశాడు.
చారిత్రకంగా ఈ ఆలయం 16వ శతాబ్దంలో చాళుక్యులు, విజయనగర రాజులు, మట్లి రాజులు మూడు దశల్లో నిర్మించారు. పొత్తపి చోళులు, విజయనగర రాజులు ఎన్నో దానాలు చేశారు. 19వ శతాబ్దంలో సాహిత్యవేత్త వావిలికొలు సుబ్బారావు ఆలయాన్ని పునరుద్ధరించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను ప్రారంభించింది. ఆలయం మూడు గోపురద్వారాలు, 160 అడుగుల ఎత్తు ముఖద్వారం కలిగి ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవటం ప్రత్యేకత. తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరణ, ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఒంటిమిట్టను మరింత అభివృద్ధి చేసే దిశగా ఇప్పుడు అక్కడున్న చెరువులో రాముడి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి