హిందువులకు మరణం అనేది అంతిమం కాదు. మరణం అంటే జీవం ఒకరూపం నుంచి మరోరూపానికి మారడం మాత్రమే. హిందువులు పునర్జన్మను చాలా బలంగా నమ్ముతారు. కర్మను అనుసరించి జనన మరణ చక్రబ్రమణం నుంచి బయటపడే వరకు ఆత్మ తిరిగి కొత్త రూపంలో జన్మ తీసుకుంటుందని హిందూ మతం బోధిస్తుంది. కనుక భౌతికంగా ఆ వ్యక్తి మన మధ్య కనిపించకపోయినా అతడి ఆత్మ ఏదో ఒక రూపంలో ఇక్కడ తిరుగాడుతుందని నమ్మకం.


మరణం ద్వారా ఆత్మ ఒక స్థితి నుంచి మరో స్థితికి పురోగమిస్తుందనేది హిందూ మత నమ్మకం. మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరాన్ని పొంది పునర్జన్మ తీసుకుంటుందని గట్టిగా నమ్ముతారు. చనిపోయిన వారికి సద్గతులు లభించాలని కోరుకుంటూ రకరకాల ఆచారాలను సంప్రదాయాలను ఆచరిస్తారు. అందుకే చనిపోయిన వ్యక్తి దుస్తులను వేరొకరు ధరించకూడదనేది కూడా ఒక నియమం. ఈ నియమానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం.


ప్రియమైన వారి మరణం ఒక భయంకరమైన అనుభవం. ఇక వారి దుస్తులు ధరిస్తే ఈ బాధ మరింత పెరగవచ్చు. భరించలేనిదిగా మారవచ్చు. అది వారి ఉనికిని మరోసారి మనకు స్ఫురణకు తెచ్చి బాధించవచ్చు. మరుపుకు రాని వారి జ్ఞాపకాలు మరింత నిరాశకు, నిస్పృహకు కారణం కావచ్చు. అందుకని మరణించిన ప్రియమైన వారి దుస్తులు ధరించకూడదని శాస్త్రం చెబుతుంది.


జ్యోతిషం కూడా దీని గురించి చర్చిస్తుంది. మరణించి పరలోకానికి చేరిన వారి దుస్తులు ఎప్పుడైనా సరే దానం చెయ్యడం మంచిదని అంటోంది. ఇలా దానం చెయ్యడం వల్ల మరణించిన వారి ఆత్మ పురోగమించడానికి, శాంతి పోందేందుకు అవకాశం ఉంటుంది. మరణించిన వారి దుస్తులు దానం చెయ్యడం వల్ల మరణించిన వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదాలు కూడా దొరకుతాయి.


హిందూ ధర్మంలో దానం అనేది ఒక ధర్మం. అవసరం ఉన్న వారిని ఆదుకోవడానికి అదొక మార్గం. దాతృత్వానికి చాలా విలువ ఉంటుంది. కర్మను సాధించేందుకు చక్కని మార్గంగా పరిగణిస్తారు. ప్రియమైన వారి మరణానంతరం వారి దుస్తులను దానం చెయ్యడం వారి జ్ఞాపకానికిచ్చే గౌరవంగా చెప్పవచ్చు. అదొక సత్కర్మగా కూడా పరిగణనలోకి వస్తుంది.


అంతేకాదు మరణించిన వ్యక్తిని తలచి తలచి బాధపడడం మానుకోవాలనేది కూడా శాస్త్రం చెబుతుంది. వారిని ఇక్కడ తలచే కొద్దీ వారి ఆత్మ ఘోషిస్తుందని నమ్మకం. వారి జ్ఞాపకాలు చుట్టూ కనిపిస్తూ ఉంటే వారిని తలచి విలపించడం అనేది సాధారణం అందువల్ల వారి గుర్తులను వీలైనంత మేర కంటి ముందు లేకుండా చెయ్యడం కూడా దీని వెనుకున్న మరో కారణం.


వారితో మనకు మాత్రమే కాదు వారికీ అనుబంధం ఉంటుంది. మనలను విడిచి వెళ్ళడం వారికి కూడా అత్యంత కష్టమైన విషయం. తిరిగితిరిగి తలచుకోవడం వారి వస్తువులు వాడుకోవడం, వారి దుస్తులు ధరించడం వారి ఆత్మకు సైతం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతుంది. అది అంత మంచిది కాదు. వారి ప్రయాణం ముందుకు సాగి మరు జన్మ వైపు వెళ్లిపోవాలనేది దీని వెనుకున్న మరో నిగూఢ రహస్యం. కనుక ఎంత ప్రియమైన వారి వస్తువులైనా, ఎంత ఖరీదైన దుస్తులైనా సరే అవి వారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు వాడుకోవడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది.


Also Read : మహాభారత యుద్ధంలో మరణించని కౌరవ‌వీరుడు ఒక్కడే..!