బుద్ధ భగవానుడి జుట్టు గురించి రకరకాల వాదనలు ప్రాచూర్యంలో ఉన్నాయి. ఆయన ప్రతి చిత్రం లేదా విగ్రహంలో ఉంగరాల జుట్టు, తలమీద ముడితో కనిపిస్తుంది. బౌద్ధ సన్యాసులు మాత్రం ఏ పాఠశాలకు చెందినా ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందినా సరే తప్పకుండా జుట్టు పూర్తిగా తీసేసి గుండుతో కనిపిస్తారు. ఇది ట్రెండ్ అనో లేక ఫ్యాషన్ అనో.. వారికి నచ్చి ఇలా గుండుతో కనిపిస్తున్నారని అనుకుంటే పొరపాటే. అది బుద్ధ భగవానుడు స్వయంగా ఏర్పాటు చేసిన సంప్రదాయం.


జ్ఞానోదయానికి ముందు గౌతముడు సిద్ధార్థుడనే యువరాజు. అతడి తండ్రి ప్రస్తుతం నేపాల్ లోని టెరాయ్ ప్రాంతానికి చెందిన లుంబినీ అనే చిన్న రాజ్యానికి రాజు. ఆ రోజుల్లో ఉత్తమ వేషధారణలో భాగంగా ఉన్నత కుటుంబాలకు చెందిన పురుషులు పొడవైన జుట్టుతో ఉండేవారు. నిండుగా ఆభరణాలు ధరించే వారు.


సంయమనం కలిగిన జీవితం


సిద్ధార్థుడు జ్ఞానోదయం తర్వాత జీవితాన్ని సంయమన మార్గంలో నడిపేందుకు నిశ్చయించుకుని అప్పటి రాచరికపు సంప్రదాయమైన పొడవైన జుట్టుతో పాటు పట్టు వస్త్రాలను కూడా వదిలెయ్యాలని నిర్ణయించుకున్నాడు. సాధారణ నారవస్త్రాలు ధరించడం శ్రేష్టమైందిగా భావించాడు. ఇక తాను అటువంటి వేషధారణతోనే తన జీవితం గడిపేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నాడు. తన నియమాల విషయంలో గౌతమ బుద్ధుడు ఎన్నడూ ఎలాంటి రాజీ పడలేదు. ఆయనను అనుసరించే బౌద్ధ సన్యాసులందరూ కూడా జుట్టు తీసేసి గుండుతో ఉంటారు. మరి బుద్ధ విగ్రహాలు, చిత్రాలన్నింటిలోనూ గౌతమబుద్ధుడు పొడవైన గిరజాల జుట్టును ముడి ధరించి ఉన్నట్టు ఎందుకు కనిపిస్తాయి? కారణం ఏమిటీ?


ఇది కళాకారుల సృజనా?


విగ్రహాల్లో బుద్ధుడు జుట్టుతో ఎందుకు కనిపిస్తారనే ప్రశ్నకు సమాధానం.. గాంధార కళ. ఇది ఒక బౌద్ధ కళారూపం ఉంటుంది. ఇది ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ లోఉన్న కాందహార్ లోని గాంధార్ ప్రాంతానికి చెందిన కళ. అక్కడే బుద్ధుడి మొదటి చిత్రాలు, విగ్రహాలు తయారయ్యాయి. స్థానిక కళాకారులు ఆయనకు ఈ రకమైన కేశాలంకరణను తమ చిత్రాలలో ఇచ్చారు. ఇక ఆ తర్వాత వచ్చిన అన్ని చిత్రాల్లోనూ గౌతమ బుద్ధుడి చిత్రాలు అదే రూపంలో వచ్చాయి. బౌద్ధ సన్యాసుల వేషధారణను అనుసరించి కచ్చితంగా బుద్ధుడు తప్పకుండా తన తలలోని వెంట్రుకలు తీసేసుకునే వాడని నిర్ధారించవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న బుద్ధుని ప్రతిమలు, చిత్రాలు కేవలం గాంధార కళాకారుల సృజన అని చెప్పవచ్చు.


Also read : ఇలాంటి వారితో కలిసి భోజనం చేస్తున్నారా? పాపం చుట్టుకుంటుంది జాగ్రత్త!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial