కార్తిక పూర్ణిమ నాడు తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిస్తాయని నమ్మకం. ఈ ఏడాది నవంబర్ 8 మంగళ వారం రోజున కార్తీక పూర్ణిమ వస్తోంది. కార్తీక మాసం అత్యంత శుభకరమైన మాసంగా దీన్ని చెప్పుకుంటారు. కార్తీక పూర్ణిమ నాడు నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఆచరిస్తారు. దీప దానం చేస్తారు. ఈ రోజున చేసే పూజ ఏడాది పొడవునా చేసే పూజ ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. కార్తీక మాసంలోనే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తినట్టు పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పూర్ణిమను దేవ దీపావళి అని కూడా అంటారు.


ఎప్పుడు ప్రారంభం అవుతుంది?


నవంబర్ 7 సోమవారం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు సంపూర్ణ పౌర్ణమి తిథి ప్రారంభం అవుతోంది. నవంబర్ 8వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకూ పూర్తవుతుంది. పూర్ణిమ నాటి స్నానాలు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలలోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.


కార్తీక పౌర్ణిమ ప్రాశస్త్యం


కార్తిక పౌర్ణిమను త్రిపురి పౌర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున మహాదేవుడు త్రిపురాసురుని వధించినట్టు చెబుతారు. త్రిపురాసురిని వధించిన శుభసందర్భంలో కాశిలో దీపాలు వెలిగించి పండగ చేశారు. అందువల్ల దీనిని దేవ దీపావళి అని కూడా అంటారు.


కార్తీక స్నాన ప్రాశస్త్యం


కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణిమ నాడు చేసే నదీ స్నానం సకల పాపాల నుంచి విముక్తిని ఇస్తుందని ప్రతీతి. స్వర్గం నుంచి దేవతలు కూడా ఈ రోజున గంగా స్నానానికి వస్తారని నమ్మకం. అందుకే ఈ రోజున తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం చెయ్యడం సాధ్యపడని వారు కనీసం ఇంట్లో అయినా గంగాజలం కలుపుకొని స్నానమాచరించడం మంచిది.


దీపదానం


కార్తీక పూర్ణిమ రోజున ప్రదోష కాలంలో నదీ స్నానం ఆచరించి దీపదానం చెయ్యడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఈ రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తన నదీ స్నానం ఆచరించి దీపం వెలిగించాలి.


ఈ ఏడాది ప్రత్యేకం


ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమీ ప్రత్యేకమైంది. ఎందుకంటే నవంబర్ 8 మంగళవారం రోజున పొద్దంతా పౌర్ణమి తిథి ఉన్నప్పటికీ సాయంత్రం చంద్ర గ్రహణం వల్ల ఆరోజున పూజలకు పనికి రాదు. కనుక నవంబర్ 7 సోమవారం సాయంత్రమే పౌర్ణమి ఘడియలు ప్రవేశిస్తున్నందున కార్తీక పౌర్ణమి పూజలు ఆరోజునే పూర్తి చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలు వెలిగించడం, ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితాన్ని ఇచ్చే 365 వత్తులు లేదా దీపాల ప్రజ్వలన కూడా చేస్తారు. ఉదయమే స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి, విష్ణువు ఆరాధన చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సంధ్యా సమయంలో 365 వత్తులు వెలిగించి పూజ చేసిన వారికి సంవత్సర కాలంలో నిత్య పూజలో చేసిన తప్పులు తొలగిపోతాయని నమ్ముతారు.




Also Read: కార్తీకమాసంలో ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఎలాంటి వత్తులు ఉపయోగించాలి?