కార్తీకమాసం పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేవి దీపారాధన, దీపదానాలు, నదీస్నానాలు మొదలైనవి. ఈ కార్తీకమాసంలో దీపారాధనకు మిక్కిలి ప్రాధాన్యం ఉంది. మరి ఈ దీపారాధనకు ఉపయోగించే ఒక్కొక్క రకమైన నూనెకి ఒక్కోరకమైన లాభాలున్నాయని అంటున్నారు పండితులు. ఆ విశేషాలేంటో తెలుసుకోండి


దీపం సాక్షాత్తూ భ‌గ‌వంతుని స్వ‌రూపం.  దీపం కింది భాగాన్ని బ్రహ్మ గా, స్తంభం విష్ణువు, ప్రమిద శివుడు, వ‌త్తి లక్ష్మీ, వెలుగు సరస్వతి గా చెబుతుంటారు. ఇక కార్తీక దీపారాధన వల్ల  సర్వపాపాలు హరింపబడి సద్గతి లభిస్తుందని, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ మాసంలో వరి, గోధుమపిండితో చేసిన దీపాల్లో లేదా మట్టిప్రమిదల్లో ఆవునెయ్యిపోసి పైడి వత్తులతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగిస్తారు. అయితే ప్రత్యేకించి నెయ్యినే వాడాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ఏదైనా నూనెను పోసైనా సరే దీపాన్ని వెలిగిస్తే చాలు ఫుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది.


కార్తీకమాసంలో దీపం ఏ దిక్కున ఉంచాలి అనేదానికి ప్రత్యేకించి నియమాలేవీ చెప్పబడలేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆలయాల్లో ఎప్పుడైనా దీపారాధన చేయవచ్చు. మామూలుగా యమద్వీపం అని చెప్పి మనం నరక చతుర్ధశి రోజు దక్షిణ దిక్కున ఆరోజున దీపాన్ని పెడతాం. కానీ ఈ కార్తీకమాసంలో మాత్రం ఏ దిక్కులో ఉంచైనా దీపాన్ని పెట్టవచ్చు.


వివిధ రకాల నూనెలతో ప్రయోజనాలు


మామూలుగా దీపారాధనకు ఆవునెయ్యి శ్రేష్టమని చెబుతారు. దీన్ని ఉపయోగించి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఆవునెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెతో చేసిన దీపాన్ని వెలిగించవచ్చు. ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల మనకు ఎదురయ్యే కష్టాలు తొలిగిపోతాయి. ఇక కీర్తి, ప్రతిష్టతలు కావాలని అని అనుకునే వాళ్లు ఆముదం నూనెతో దీపాలను వెలిగించాలి. కొబ్బరి నూనెతో కూడా దీపారాధనను చేయవచ్చు. దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఇక పంచదీప నూనె అని కూడా ఉంటుంది. అంటే నువ్వులు నూనె, కొబ్బరినూనె, ఆముదం, ఇప్ప నూనె, ఆవునెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తారు. ఇలా పంచ దీప నూనెతో దీపాలను వెలిగించడం వల్ల అనారోగ్య బాధలు దూరమవుతాయి. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే తొలిగిపోతాయి. దారిద్య్రం తొలిగిపోతుంది.


వత్తుల సంఖ్యను బట్టీ ఫలితాలు


ఇక దీపారాధనలో దీపం ఒక్కటే కాదు మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి కూడా దానికి తగిన ఫలితాలుంటాయి. తామర వత్తుల దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతందట. ఇక జిల్లేడుపూలతో తయారు చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే వినాయకుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ఎరుపునార వత్తులతో దీపం పెడితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుతుంది. దూదితో చేసిన వత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్టవంతులవుతారు. ఇక వేసే వత్తుల సంఖ్యను బట్టి కూడా ఫలితాలున్నాయంటున్నారు పండితులు. రెండు వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మన:శాంతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు వత్తుల దీపం పెట్టాలి, దారిద్ర్యం తొలగాలంటే నాలుగు వత్తుల దీపం మంచిది. సంపదల కోసం ఐదువత్తులతో వెలిగించాలి. విద్యాబుద్దులు కావాలంటే ఆరు వత్తుల దీపం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు.