ఇప్పటం గ్రామానికి వెళ్లేటప్పుడు పోలీసులు కలిగిస్తున్న ఆటంకాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పక్కన పోలీసులు రిక్వస్ట్ చేస్తుంటే పవన్ కల్యాణ్ వాళ్లకు ప్రతి నమస్కారం పెడుతూ ఏమైనా చేసుకోండని చెప్పడం అందులో ఉంది. 


ఇప్పటం గ్రామానికి వెళ్లేందుకు ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి మంగళగిరి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు పోలీసులు అడుగడుగునా ఆటంకం కల్పించారు. రోడ్డు పొడవునా కంచెలు వేసి.. ఇప్పటం వెళ్లేందుక అనుమతి లేదని తేల్చి చెప్పారు. వాహనాలను కూడా ఆపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ కల్యాణ్‌ కార్లు దిగి నడిచి వెళ్లారు. 


హైవేపై సుమారు మూడు కిలోమీటర్ల మేర నడుస్తూ ఇప్పటం గ్రామం వైపు కదిలారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ని వెళ్లొద్దని రిక్వస్ట్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. పోలీసులు కలిగిస్తున్న ఆటంకాలపై ఆగ్రహానికి గురైన పవన్ కల్యాణ్‌... ఇవాళ నాయకులంతా అరెస్టు అయ్యేందుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. 






పోలీసులు కొడితే రక్తం రావాలంటూ సూచించారు. గూండా ప్రభుత్వమో మనమో తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. పక్కనే ఉన్న ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ... మీరు అలా అంటే లా అండ్ ఆర్డర్ ప్రోబ్లమ్‌ అవుతుందని అంటారు. దీనిపై ఫైర్ అయిన పవన్ కల్యాణ్‌... ఊరుకోండి సార్‌ మీరు లా అండ్‌ ఆర్డర్‌ మాట్లాడతారు అంటూ కసురుకుంటారు. హత్యలు చేసేవాళ్లను మీరు కాపాడండి... మమ్మల్ని మాత్రం చావగొట్టండి అంటూ దండం పెడతారు. 


తాము చెప్పే వినాలంటూ రిక్వస్ట్ చేసినా పవన్ వినిపించుకోలేదు.. సారీ సార్ అంటూ దండం పెట్టి ముందుకు కదిలారు. ఇంతలో పవన్‌ను కన్విన్స్ చేయాలంటూ తన వెనుకున్న అధికారికి బాధ్యత అప్పగించారు పోలీసు ఉన్నతాధికారి. ఆయన కూడా ఏదో రిక్వస్ట్ చేస్తుంటే పవన్ వినిపించుకోలేదు. కొట్టుకోండీ... తిట్టుకోండి... చంపుకోండీ... మాకు ఓకే అంటూ విరుచుకుపడ్డారు. ఐదు నిమిషాలు చెప్పేది వినాలన్నా కూడా సారీ సార్‌ అంటూ ముందుకెళ్లిపోయారు పవన్ కల్యాణ్.