పవన్ కల్యాణ్‌ ఇప్పటం పర్యటన కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ వారిపై సీరియస్ అయ్యారు. రోప్‌ టీం ఆయన్ని ఆపేందుకు యత్చినా వాటిని దాటుకొని సుమారు మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. 


జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్.. తన కారు పైనే కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఇప్పటం చేరుకున్నారు. 


అక్కడ బాధితులతు మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.... వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు భూములు ఇచ్చారనే ఇప్పటంపై కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 


రాష్ట్రంలో రోడ్లు వేయలేరు... గుంతలను పూడ్చలేరు కానీ.. రోడ్లు విస్తరణ పేరుతో కక్ష సాధింపులకు దిగుతున్నారని పవన్ ఆరోపణలు చేశారు. వైసీపీ ఇలా చేస్తూ వెళ్తే మాత్రం తాము ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. ఇప్పటం ఏమైనా కాకినాడా.. రాజమండ్రినా అని ప్రశ్నించారు.  ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా అని నిలదీశారు.  కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ది ఉందా... తాము ఏమైనా గూండాలమా.. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. 


అధికారులు స్ఫృహ తెచ్చుకొని పని చేయాలని సూచించారు పవన్ కల్యాణ్. తాను రక్తం చిందించడానికి సిద్ధమే కానీ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు రాజ్యాంగ పరిరక్షణకు పని చేయాలని సూచించారు. 


పోలీసులు ఎన్ని అడ్డుకుంలు సృష్టించినా అడ్డుకున్నా మౌనంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. పోలీసులు కూడా తమ సోదరులే వారి కష్టాలు తమకు తెలుసన్నారు. మార్చిలో జనసేన సభకు స్థలం ఇస్తే...ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. తమ మట్టిని కూల్చారు.. మీ కూల్చివేత తథ్యం అంటూ శాపనార్థాలు పెట్టారు. 


ఒకటి రెండు ఇళ్లను కాకుండా అధికారులు కూల్చేసిన ప్రతి ఇంటికి వెళ్లారు పవన్ కల్యాణ్. వారికి ధైర్యం చెప్పారు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.